వరంగల్‌రూరల్, ఆగస్టు 10 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో పచ్చదనం పెంపు, ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఊరూరా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పుడు మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఒకేచోట 8 నుంచి పదెకరాల విస్తీర్ణంలో పార్కు ఉండాలని అధికారులను ఆదేశించింది. పార్కులో చేపట్టాల్సిన పనులు, బయో ఫెన్సింగ్, పాత్‌వేలు, పిల్లల ఆట స్థలం, నాటాల్సిన మొక్కలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ తరహా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు మండలంలో ఒకేచోట ఎనిమిది నుంచి పదెకరాల స్థలాలను గుర్తించి, ప్రదిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
పంచాయతీ ట్రాక్టర్లతో లెవెలింగ్
వరంగల్ రూరల్ జిల్లాలో 16 మండలాలకు గాను 13 మండలాల్లో పార్కుల ఏర్పాటుకు మంజూరు లభించింది. మరో మూడు మండలాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆమోదం లభించిన చోట అధికారులు పనులు ప్రారంభించారు. సంబంధిత స్థలం లో పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్లతో చదును చేయిస్తున్నారు. చుట్టూ బయో ఫెన్సింగ్, తొమ్మిది అడుగుల వెడల్పుతో రహదారి, పార్కు మధ్యలో చిల్డ్రన్స్ పార్కు, పాత్‌వేల ఏర్పాటుకు మొరం పోస్తూ మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.
పార్కుల్లో ప్లాంటేషన్
కొన్నిచోట్ల ప్లాంటేషన్ పనులు కూడా మొదలుపెట్టారు. బయో ఫెన్సింగ్‌తో పాటు ప్లాంటేషన్‌లో భాగంగా 20 రకాల మొక్కలు 31వేలు ఉండేలా పనులు చేపడుతున్నారు. ఫెన్సింగ్ కోసం మీటరుకు ఒకటి చొప్పున గచ్చకాయ, వెదురు మొక్కలు ఎక్కువగా పెడుతున్నారు. పార్కులో ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, ఇప్ప, చింత, ఈత, అందుగ, నెమలినార, వెదురు, శాండల్ వుడ్, రేగు, కుంకుడు, పనస, సీమచింత, జమ్మి, వావిలి, టెన్న, సీతాఫలం, జామ, తంగేడు, పారిజాతం, అడ్డసారం, తిప్పతీగ, పొడపతి తదితర మొక్కలు నాటుతున్నారు. జిల్లాలో 9 మండలాల్లో ప్లాంటేషన్ చేపట్టినట్లు గ్రామీణాభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజరు రమేశ్ వెల్లడించారు.