వరంగల్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. అదును వానలు, కాళేశ్వరం, ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టులతో పుష్కలంగా నీరు.. నిరంతర కరంటు.. రైతుబంధు సాయం తదితర సానుకూలతలతో ఎక్కడా ఖాళీ జాగ లేకుండా రైతులు సాగులోకి తెచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి 14.04 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, ఇప్పటికే 65 శాతం పంటల సాగు పూర్తయింది. సీజన్ మరో రెండు నెలలుండగానే ఆరు జిల్లాల్లో కలిపి 9.69 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. నీళ్లు పుష్కలంగా ఉండడంతో ఈ సారి రైతులు వరిసాగు వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో పాటు పత్తి విస్తీర్ణం కూడా ఎక్కువగానే ఉన్నది. అక్కడక్కడా మొక్కజొన్న పంటను వేశారు. మొత్తంగా మరో రెండు వారాల్లో పంటల సాగు పూర్తికానుంది.
వరి సాగు ఎక్కువ..
సాగునీటికి భరోసా ఉండడంతో రైతులు వరిసాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 65శాతం భూముల్లో పంటలు వేయగా, మరో 35 శాతం భూము ల్లో పంటలు వేయాల్సి ఉన్నది. ఒకటి రెండు పంటలు మినహా అన్ని పంటల విత్తనాలు వేసేందుకు దాదాపుగా అదను పూర్తయింది. వరిపంట సాగుకు మాత్రమే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పంట వేయకుండా ఉన్న మొత్తం భూముల్లో వరినాట్లు వేసేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అంచనా మేరకు ఉమ్మడి జిల్లాలో ఈ సారి వరిసాగు విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉంది. వరి తర్వాత ప్రధాన పంటగా ఉన్న పత్తి గత సీజన్లో అధిక వానలతో దిగుబడి తగ్గడంతో ఈ సారి సాగు విస్తీర్ణం కాస్త తగ్గింది. కందులకు మార్కెట్లో మంచి ధర ఉండడం, పెట్టుబడి తక్కువ కావడంతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. కొందరు పత్తి, ఇతర పంటల్లో అంతర పంటగా వేయగా, మరికొందరు సొంతంగా దీన్ని సాగు చేశారు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో మక్కజొన్న పంట సాధారణ సాగు విస్తీర్ణం కంటే తగ్గగా, మహబూబాబాద్ జిల్లాలో మాత్రం భారీగా పెరిగింది. ఈ జిల్లాలో మక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 26,987 ఎకరాలు కాగా, ఇప్పటికే 44,065 ఎకరాల్లో సాగు చేశారు. పెసర, మినుములు, నువ్వుల పంటలు సాధారణ విస్తీర్ణం కంటే పెరిగాయి.