సుబేదారి, నవంబర్ 1: వరంగల్ కమిషనరేట్ పరిధిలో సోమవారం పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కొరడా ఝుళిపించారు. హెల్మెట్ లేని వారికి అవగాహన కల్పించి, జరిమానాలు విధించారు. కొన్ని చోట్ల వాహనాల తాళపు చెవిలను తీసుకొని హెల్మెట్ తీసుకొచ్చాక అందజేశారు. మరికొన్ని చోట్ల బండ్లను సీజ్ చేశారు. స్వయంగా తనిఖీల్లో పోలీస్ కమిషనర్ సీపీ తరుణ్‌జోషి పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పక హెల్మెట్ ధరించాలని, పక్కగా వాహనానికి రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ ఉండాలని అన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్‌గా వెళ్లొద్దని, మద్యం తాగి వాహనం నడుపొద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు నడిపితే ఒకటి, రెండు సార్లు చూసి వారి తల్లిదండ్రులపై కేసులు పెడుతామని సీపీ హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించ కుండా ద్విచక్ర వాహనదారులు విలువైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నగరంలో ఇపుడున్న వరంగల్, కాజీపేట, హనుమకొండ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లతోపాటుగా, కొత్తగా కేయూసీ, జనగామ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట పోలీసుస్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ విభాగాన్ని ఏర్పాటుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సీపీ పేర్కొన్నారు.
హెల్మెట్‌తో బైక్ ర్యాలీ
సీపీ, ఇతర పోలీసు అదికారులు, సిబ్బంది హనుమకొండ పోలీసుస్టేషన్ నుంచి సుబేదారి వరకు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి, ట్రాఫిక్ సీఐలు విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మామునూరులో..
కరీమాబాద్, నవంబర్ 1:మామునూరు సబ్ డివిజన్ పరిధిలోని వాహనాలను ఏసీపీ నరేశ్‌కుమార్ తనిఖీ చేశారు. రూల్స్ పాటించని వారి ఫొటోలను తీసి ప్రజలు పోలీసులకు పంపాలన్నారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు చర్యలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అబ్దుల్ రహీమ్, సిబ్బంది పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి, నవంబర్01: మండలంలోని వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిలో గిర్నిబావి వద్ద ఎస్సై నవీన్‌కుమార్ నాకాబందీ నిర్వహించారు. చలానాలు పెండింగ్‌లో ఉన్న వాహనాలను సీజ్ చేశారు.
నర్సంపేటలో..
నర్సంపేట, నవంబర్1: నర్సంపేట పట్టణంలో ఎస్సై రాంచరణ్ హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటోలను ఎవరైనా సరే తీసి 9491089113, 9440795211, 7382629254 నంబర్‌కు వాట్సాప్ పంపించాలని కోరారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట, నవంబర్ 1: మండలంలో ఎస్సై శీలం రవి వాహనాలను తనిఖీ చేశారు. పత్రాలు సరిగా లేని 11 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 64 మందికి జరిమానా విధించారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి, నవంబర్ 1: ఎస్సై బండారు వెంకటేశ్వర్లు మండల కేంద్రంతో పాటు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. పెండింగ్‌లో చలాన్లను దగ్గర్లోని మీ సేవలో చెల్లించాలన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నెక్కొండలో 30 వాహనాల సీజ్
నెక్కొండ, సెప్టెంబర్1 : ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో 30 వాహనాలను సీజ్ చేసినట్లు ఏసీపీ ఫణీంద్ర తెలిపారు. సోమవారం నెక్కొండలో వాహనాలను తనిఖీ చేశారు.