గురువారం 25 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 11, 2021 , 00:28:31

ఐలో జాతరకు వేళాయె

ఐలో జాతరకు వేళాయె

  • ముస్తాబవుతున్న ఐనవోలు మల్లన్న ఆలయం
  • రూ.కోట్లతో భక్తులకు సకల సౌకర్యాలు
  • పర్యవేక్షణ కోసం 80 సీసీ కెమెరాల ఏర్పాటు
  • 400 మంది పోలీసు సిబ్బందితో భద్రత
  • రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం

అద్భుత శిల్ప సంపదతో జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు మల్లన్న దేవాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. సంకాంత్రి నుంచి ఉగాది వరకు దాదాపు మూడు నెలలపాటు జాతర కొనసాగనున్నది. దేవుడి పట్నాలు, బోనాలు, శివసత్తుల పూనకాలు, ఒగ్గుకథలతో మల్లన్న సన్నిధి మార్మోగనున్నది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.

- ఐనవోలు, జనవరి 10 

రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం

రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. అద్భుత శిల్ప సంపదతో సువిశాల ప్రాంగణంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైంది. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.

ఆలయ విశిష్టత..

ఐనవోలు ఆలయానికి 1100 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయ్యన్నదేవుడు మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. అందుకే ఆయన పేరిట అయ్యనప్రోలుగా పిలువబడి, కాలక్రమంలో ఐనవోలుగా స్థిరపడిపోయింది. 10 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మల్లన్న రూపం, ఆలయ ప్రాంగణంలో అష్టోత్తర స్తంభాలు, విశాల మండపాలు, రాతిప్రాకారాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, మార్నేని వంశస్తులు కొద్దిరోజులు దేవాలయ నిర్వహణను కొనసాగించారు. ఆదాయంలో 50శాతం మార్నేని వంశస్తులకు చెందితే, మరో 50శాతం ఒగ్గు, తమ్మళ్ల పూజారులు, నాయీబ్రాహ్మణులు, రజకులకు చెందేది. 1966లో మార్నేని వంశస్తులు ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించారు.

ప్రభుత్వ సహకారంతో ఆలయ అభివృద్ధి 

వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటి వరకు సుమారు రూ.10కోట్ల నిధులు మంజూరు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మంత్రి ఎర్రబెల్లి అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ యాదవరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.

- ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు 

మల్లికార్జునస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ, దేవాలయ నిధులు, దాతల సహకారంతో సకల సౌకర్యాలు కల్పిస్తాం. అందరి సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం.      

- ఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు

12 నుంచి ఉగాది దాకా.. 

12న ఉత్సవాలు ప్రారంభం, 13న భోగి పండుగ, 14న మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, 16న మహాసంప్రోక్ష సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకాదేవి(ఎల్లమ్మ దేవత) పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు. ఏప్రిల్‌ 13న ఉగాది(తెలుగు నూతన సంవత్సరాది) కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఆరేళ్లలో రూ.10 కోట్ల అభివృద్ధి

1100 ఏళ్ల చరిత్ర ఉన్న ఐనవోలు ఆలయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐనవోలు ఆలయ అభివృద్ధికి ఆరేళ్ల కాలంలో దాదాపు రూ.పది కోట్ల నిధులు కేటాయించింది. కుడా నిధులు రూ.5 కోట్లతో ఆలయం చుట్టూ ఎర్రరాతి గోడ, స్వాగత తోరణాలు, ఐమాక్స్‌ టవర్లు నిర్మించారు. సీఎం స్పెషల్‌ నిధులు రూ.2కోట్లతో డబుల్‌ రోడ్లు, సీసీ రోడ్లు, డివైడర్లు, డ్రైనేజీల నిర్మాణం, ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న కాకతీయ కీర్తి తోరణాన్ని పునర్నిర్మించారు. దేవాలయ నిధులతో లైటింగ్‌, శాశ్వత మరుగుదొడ్లు, దేవాలయ కార్యాలయంతోపాటు తదితర నిర్మాణాలు చేపట్టారు. సుమారు రూ.75 లక్షలతో అన్నదాన సత్రం, గెస్ట్‌హౌస్‌, దాతల సహకారంతో రూ.3కోట్ల నిధులు వెచ్చించి 42 గదులతో ‘మల్లన్న సదన్‌' నిర్మిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 400 మంది పోలీస్‌ సిబ్బందితో భద్రత, 80 సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించనున్నారు. కాగా, జాతర బందోబస్తుపై ఆదివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఆలయ ఈవో నాగేశ్వర్‌రావు, పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్‌, ఎస్సై నర్సింహారావు, సిబ్బంది కిరణ్‌కుమార్‌తో సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, క్యూలైన్లు తదితర విషయాలపై చర్చించారు. 

VIDEOS

logo