శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Jul 19, 2020 , 01:31:16

‘కాలేజీయేట్‌'లోనే విద్యావికాసం

‘కాలేజీయేట్‌'లోనే విద్యావికాసం

  • ఈ స్కూల్‌తో పీవీకి ఎనలేని బంధం
  • ఉద్ధండులను తీర్చిదిద్దిన గుడి  
  • ఉద్యమాలకు నెలవైన వేదిక
  • సంస్కృతి, సాహిత్యాల మేళవింపు 
  • సదాశివరావుతో చెలిమీ ఇక్కడే..

భారతదేశ సంస్కరణలకు ఆద్యుడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎదిగేందుకు అక్షర బీజం పడింది..  అసమాన ప్రతిభావంతుడిగా ఆయన ప్రస్థానానికి మార్గనిర్దేశం చేసింది హన్మకొండలోని కాలేజీయేట్‌ స్కూల్‌. తన ప్రాణమిత్రుడు సదాశివరావుతో పరిచయం ఏర్పడింది కూడా ఇక్కడే. ఈ బడి ఎందరో ఉద్ధండులను తీర్చిదిద్దిన గుడి. కాలేజీయేట్‌ స్కూల్‌లో పీవీ మధుర స్మృతులు ‘నమస్తే తెలంగాణ’ పాఠకులకు ఆదివారం ప్రత్యేకంగా..


 వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ : పీవీ చదివిన బడి.. తిరిగిన గుడి. ఎదిగించిన ఓరుగల్లు. ఎల్లడెలా వ్యాప్తమైన ఆయన ప్రయాణం, ప్రస్థానం పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతిదీ ప్రత్యేకమే. అనేక విలక్షణాలు, విశిష్టతలకు నెలవైన పీవీ జీవిత మజిలీ ఓరుగల్లు పేగుబంధంతో పెనవేసుకున్నది. పీవీ నర్సింహారావు 1931-32 ప్రాంతంలో ప్రైమరీ విద్యను తనస్వగ్రామంలో పూర్తిచేసుకొని ఆరో తరగతిలో జాయిన్‌ కావడానికి హన్మకొండకు వచ్చారు. అప్పటి కాలేజీయేట్‌ స్కూల్‌లో పీవీ చేరారు. అప్పుటి నుంచి ఆయన ప్రయాణం.. ప్రస్థానం ఆగలేదు. వరంగల్‌ ఆయనకు విద్యనేర్పింది. పీవీని మహోన్నత రాజనీతిజ్ఞతగల వ్యక్తిగా తొలినాళ్లల్లో తీర్చిదిద్దిన గడ్డ వరంగల్‌. ఆధునిక భారత సంస్కరణలకు దారులు చూపిన దార్శనికుడిగా ఆయన ఎదిగేందుకు బీజం పడింది ఇక్కడే. 

కాలేజీయెట్‌ స్కూల్‌కి వెయ్యేళ్ల కీర్తి 


కాలేజీయెట్‌ స్కూల్‌ వెయ్యేళ్ల కీర్తి శిఖరాలను అందించింది. దేశ విదేశాల్లో అనేక రంగాల్లో ఉద్ధండులను అందించిన అసమాన అక్షర వృక్షమది. అక్కడి చెట్లకింద. ఈ తరగతి గదుల్లో కూర్చుని వి జ్ఞానమూర్తులుగా ఎదిగిన వారెందరో? రాజకీయాల్లో, పాలనల్లో, సాహిత్య రంగంలో ఎంతోమం ది ఈ కాలేజీయెట్‌ స్కూల్‌ గుండెగదుల్లో కూర్చొని జ్ఞానమూర్తులుగా ఎదిగారు. ఈ దేశానికి ప్రధానిని అందించింది. ఉమ్మడి రాష్ర్టానికి అనేక మంత్రులను అందించింది. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ఉద్యమగురువు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ను అందించిందీ కాలేజీయేట్‌ స్కూలే. ప్రజాకవి కాళోజీ సోదరులు ఇక్కడే విద్యను అభ్యసించారు. మాజీ మంత్రి టీ హయగ్రీవాచారి అనేక మంది ఉద్ధండ పిండాలను అందించిన విద్యాశిఖరం కాలేజీయేట్‌ స్కూల్‌ వెయ్యేళ్లకీర్తిని ఓరుగల్లు దీప్తిని దశదిశలా చాటేలా చేసింది. 

భద్రకాళీ చెరువు వైపు పీవీ

పీవీ, పాములపర్తి సదాశివరావు సహా వారి సహాధ్యాయులు సెలవుదినాల్లో భద్రకాళీ గుట్టలూ, పద్మాక్షమ్మ గుట్ట, సిద్ధేశ్వరాలయం, వరంగల్‌కోట, వేయిస్తంభాల గుడి, గోవిందరాజులు గుట్టలు, మెట్టుగుట్టకు కాలినడకనే తిరిగొచ్చేవారట. పాకాల చెరువు, రామప్ప శిల్పకళావైభవాన్ని లోకానికి ప్రపంచానికి చాటడంతో పీవీ తన ఓరుగల్లు అనుబంధాన్ని వేనోళ్లా కీర్తించేలా చేశారని వారు వెలువరించిన అనేక వ్యాసాల్లో పేర్కొనడం విశేషం. అప్పుడప్పుడూ సాయంత్రం మిత్ర బృందంతో మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌ పక్క సందులో తిరుగుతూ  జై భారత్‌ టాకీసు (ఇప్పుడు రామ్‌ లక్ష్మణ్‌ టాకీసు స్థలంలో ఉన్న అలనాటి టాకీస్‌) ముందు దుకాణంలో మిర్చి బజ్జీలను ఆస్వాదించేవారు. ఇవన్నీ 1945-55 మధ్య కాలంలో పీవీ మధుర స్మృతులు. 

పీవీ మిత్రబృందం 


పీవీ నర్సింహారావుకు ఆనాటి దళిత ఉద్యమ రచయిత, లోహియా భావజాలపు మేధావి జీ సురమౌళితోపాటు సదాశివరావు దగ్గరకు వచ్చే డాక్టర్‌ టీఎస్‌ మూర్తి అంటే ఎంతో ఇష్టమట.! రవివర్మ ఫొటో స్టూడియో యజమాని గొప్ప ఫొటోగ్రాఫర్‌, పెయింటర్‌ అయిన బిట్ల నారాయణ, మిగతా అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వారితో తన స్నేహమాధుర్యాన్ని పంచుకునేవారట.! ఆ తర్వాతి తరంలో కోవెల సుప్రసన్నాచార్యులు, డాక్టర్‌ ఐ వెంకట్రావు, ముదిగొండ వీరభద్రరావు, సంపత్‌ రాజరాం వంటివారికి పీవీవో సత్ససంబంధాలుండేవి. అదేవిధంగా రెండేళ్లక్రితం మరణించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ వీఎల్‌ నరసింహారావు 1982లో వరంగల్‌లో నెలకొల్పిన జనప్రియ గాన సభ ప్రారంభోత్సవంలో పీవీ పాల్గొని చాలా కాలం తరువాత ప్రముఖ సంగీతకారిణి నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక గాత్ర కచేరీని మిత్రుడు సదాశివరావు పక్కన కూర్చొని ఆస్వాదించడం ఒక గొప్ప విశేషంగా ఓరుగల్లు చరిత్ర చెప్పుకుంటుంది.

తబలా వాయిద్యంలో పీవీ 

కాకతీయ కళా సమితి కార్యక్రమాల్లో పీవీ కూడా అప్పుడప్పుడూ పాల్గొనేవారు. పీవీ తబలా వాయిస్తే, సదాశివరావు హార్మోనియంపై అరుదైన రాగాల గమకాల్ని తమ గొంతుతో పలికించేవారు. ఆ దృశ్యం ఎంతో కమనీయంగా ఉండేదని ప్రముఖచరిత్రకారుడు కొండబత్తిని జగదీశ్వరరావు పాములపర్తి సదాశివరావు సంస్మరణ సంచికలో పేర్కొనడం విశేషం 

నీ పేరేమిటోయ్‌..?

పీవీ స్కూల్‌లో చేరిన తొలిరోజు మధ్యాహ్న భోజనం ముగించి స్కూల్‌ ఆవరణలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ నల్లా వద్ద నీళ్లు తాగుతున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చిన అదే వయస్సు గల మరో పిల్లవాడు తనూ నీళ్లు తాగుతూ యథాలాపంగా ‘నీపేరేంటోయ్‌' అని అడిగారట. ఆ రోజుల్లో ఇంటి పేరుతో సహా పూర్తిగా చెప్పే పద్ధతి ఉంది కాబట్టి ఆ మొదటి బాలుడు నా పేరు పాములపర్తి వేంకట నరసింహారావు అని చెప్పాడు. ‘అరే నా పేరు పాములపర్తి సదాశివరావు’ అని పీవీని పరిచయం చేసుకున్నారట. అలా మొదలైన వారి స్నేహం జయవిజయులుగా అప్రతిహతంగా కొనసాగింది. అప్పటి కాలేజీయేట్‌ హైస్కూల్‌ పీవీ నర్సింహారావు వంటి ఉద్ధండులను తీర్చిదిద్దింది. ఆ కాలంలో రెండే రెండు స్కూళ్లు విద్యావేత్తలను, రాజకీయ దురంధరులను ఈ దేశానికి అందించాయి. వరంగల్‌తో మొదలైన పీవీ ప్రస్థానం దేశవిదేశాల్లో ఓరుగల్లు ఖ్యాతిని ఇనుమడింపచేసింది. పాములపర్తి సదాశివరావు, పీవీ నర్సింహారావుల మధ్య స్నేహబంధం పదికాలాలకు సరిపడా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని దశదిశలా వ్యాప్తింపజేసింది అని పాములపర్తి సదాశివరావు కుమారుడు నిరంజన్‌రావు పేర్కొన్నారు. 


logo