శనివారం 06 జూన్ 2020
Warangal-city - Apr 21, 2020 , 02:46:50

రైతు కష్టం తెలిసిన సీఎం

రైతు కష్టం తెలిసిన సీఎం

  • దేశంలో ఎక్కడాలేని విధంగా పంట కొనుగోలుకు ప్రభుత్వం హామీ 
  • రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే  కేసులు
  • 7 వరకు లాక్‌డౌన్‌ పాటించాలి 
  • రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • పలు చోట్ల ధాన్యం కొనుగోళ్ల పరిశీలన, ప్రారంభం
  • ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ

జనగామ, నమస్తే తెలంగాణ/దేవరుప్పుల/కొడకండ్ల/రాయపర్తి : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు రైతు కష్టం తెలుసునని, అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా పండిన పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ ఆవరణలో, దేవరుప్పుల మండలంలోని సీతారాంపురం, సింగరాజుపల్లి, లింగాలఘనపురం మండలం వడిచర్ల, వనపర్తి, కొడకండ్ల మండలంలోని ఏడునూతుల, పాలకుర్తి మండలం లోని ముత్తారం, రాయపర్తి మండలం కొండాపురం గ్రా మాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పక్క రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, వచ్చే వానాకాలం నాటికి దేశానికే తెలంగాణ ధాన్యాగారం అవుతుందని అన్నారు. రైతులకు సమస్యలు సృష్టించడం సరికాదని, ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్‌ నుంచి కార్మికులను రప్పించి పనులు చేయించే పరిస్థితి తెచ్చుకోవద్దని పేర్కొ న్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని బురహాన్‌పల్లి, కిష్టాపురం, సన్నూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐనవోలు మండలంలోని నందనం గ్రామానికి చెందిన కారోబార్‌ బత్తిని అశోక్‌ కరోనా బాధితుల సహా యార్థం తన నెల వేతనం రూ.8500 చెక్కును దయాకర్‌రావుకు అందించారు. అలాగే దేవరుప్పులలో ఆటోడ్రైవర్లు, నిరుపేద కుటుంబాలకు ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా వెయ్యి నిత్యావసర సరుకుల కిట్లను మంత్రి అందజేశారు. అలాగే జనగామ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందికి గ్రీన్‌కో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఎండీ అనిల్‌ సౌజన్యంతో 150 పీపీ ఈ కిట్లను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమునతో కలిసి అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జీసీసీ చైర్మన్‌ గాంధీనాయక్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పూజారి రఘు, జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మహేందర్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, సివిల్‌ సప్లయ్‌ డీఎం రాంపతి, డీఎస్‌వో రోజారాణి, రూరల్‌ జిల్లా డీఆర్‌డీవో మిట్టపల్లి సంపత్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి భాస్కర్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ పాల్గొన్నారు. దేవరుప్పుల మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీపీ బస్వ సావిత్రి, తహసీల్దార్‌ ఫరీదుద్దీన్‌, ఎంపీడీవో అనిత, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, కొడకండ్లలో మండల ప్రత్యేక అధికారి ప్రేమ్‌కరణ్‌ రెడ్డి, తహసీల్దార్‌ జడల రమేశ్‌, రాయపర్తి మండలంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo