బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 10, 2020 , 02:43:31

పండుగ పూట విషాదం

పండుగ పూట విషాదం

సంగెం, మార్చి 09: రెక్కాడితే గాని డొక్కాడని రెండు కుటుంబాల్లో పండుగపూట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కాపులకనపర్తికి చెందిన దౌడు మారయ్య, సంపూర్ణ దంపతుల కుమారుడు రాకేశ్‌(9), కందికట్ల మస్తాన్‌, యాకలక్ష్మి  దంపతుల కుమారుడు కందికట్ల యశ్వంత్‌(13)తోపాటు సదిరం రాకేశ్‌, బర్ల రాజ్‌కుమార్‌ సోమవారం ఉదయం హోలీ ఆడుకున్నారు. అనంతరం స్నానం చేయడానికి కాపులకనపర్తి గ్రామంలోని పాయచెరువులోకి వెళ్లారు. అక్కడ అప్పటికే బట్టలు ఉతుక్కుంటున్న కొందరు వారిని చూసి చెరువు లోతుగా ఉన్నందున అందులోకి దిగి స్నానం చేయొద్దని హెచ్చరించారు. దీంతో ఆ నలుగురు విద్యార్థులు వారికి కనిపించకుండా మరోవైపు చెరువుకట్టకు దూరంగా వెళ్లారు. అనంతరం చెరువులో ఉన్న బండపైకి వెళ్లారు. ముందు వరుసలో ఉన్న దౌడు రాకేశ్‌, కందికట్ల యశ్వంత్‌ తమ ఒంటిపై ఉన్న బట్టలు తీసి ఉతుక్కుంటూ జారి చెరువులో పడిపోయారు. ఈ క్రమంలో భయంతో సదిరం రాకేశ్‌, బర్ల రాజ్‌కుమార్‌ చెరువులో నుంచి బయటకు వచ్చి పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న వారికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన వెళ్లి చూడగా.. చెరువులో మునిగిపోవటం వల్ల విద్యార్థుల ఆచూకీ లభించలేదు. చెరువులో ఇద్దరు విద్యార్థులు మునిగిపోయారనే సమాచారాన్ని తెలుసుకున్న పర్వతగిరి సీఐ పు ల్యాల కిషన్‌, సంగెం, ఐనవోలు ఎస్సైలు సురేశ్‌, నర్సింహతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నా రు. వెంటనే గ్రామంలో ఈత వచ్చిన వారిని పిలిపించి విద్యార్థులు మునిగిన ప్రాంతంలో వెతికారు. గంట తర్వాత దౌడు రాకేశ్‌, కందికట్ల యశ్వంత్‌ మృతదేహాలను వెలికి తీసుకొచ్చారు.

అయ్యో.. బిడ్డలారా..

విద్యార్థుల మృతితో రెండు కుటుంబాల సభ్యులు  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బడికి సెలవు లేకుంటే బతికేటోళ్లు బిడ్డలారా.. అంటూ వారి రోదనలు చూపరులకు కన్నీటిని తెప్పించాయి. రాకేశ్‌ సంగెం ఎస్సీ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. హోలీ పండుగకు సెలవు రావడంతో అదే గ్రామానికి చెందిన తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. కందికట్ల యశ్వంత్‌ కాపులకనపర్తి జెడ్పీఎస్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అతడిది పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామం. కాగా, తండ్రి వీరిని వదిలివేయడంతో కాపులకనపర్తిలోని అమ్మమ్మ ఇంటి వద్దే యశ్వంత్‌ తన తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి ఉంటున్నాడు. రాకేశ్‌ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా, విద్యార్థులు చెరువులో మునిగిపోయారనే సమాచారం అందుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. చెరువులో అక్రమంగా మొరాన్ని తీసిన గుంతలు ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం చెరువు నుంచి తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం వైద్యశాలకు తరలించారు.

ఘటనా స్థలి సందర్శన..

కాపులకనపర్తి చెరువులో పడి విద్యార్థులు మృతి చెందారనే సమాచారం అందుకున్న సంగెం తహసీల్దార్‌ వీ సుహాసిని, పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ రంగంలోకి దిగి సర్పంచ్‌ ఎర్రబెల్లి గోపాల్‌రావు, ఎంపీటీసీ సుతారి బాలకృష్ణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి సహకారంతో గజ ఈతగాళ్లను రప్పించి విద్యార్థుల మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం రాకేశ్‌, యశ్వంత్‌ మృతదేహాలను తహసీల్దార్‌ పరిశీలించి, వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉంటే.. రెండు  రోజుల క్రితమే మండలంలోని అన్ని చెరువుల వద్ద పోలీసులు ‘పిల్లలు చెరువు వద్దకు రావొద్దు’ అనే ప్లెక్సీలను ఏర్పాటు చేయించారు. హోలీ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా చెరువులోకి వెళ్లిన ఇద్దరు పిల్లల మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేశ్‌ తెలిపారు.


logo
>>>>>>