శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 29, 2020 , 01:37:25

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి

పాన్‌గల్‌ : ప్రశ్నించుకొని పరిశోధించేవాడే సైంటిస్టు కాగలడని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, డీఈవో సుశీందర్‌రావు అన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా మండలంలోని కేతేపల్లి ఉన్నత పాఠశాలలో శుక్రవారం కీర్తిశేషులు రిటైర్డ్‌ హిందీ పండిట్‌ సిద్ది కృష్ణయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారుల సహకారంతో మండలస్థాయి సైన్స్‌ ప్రదర్శనలు, క్విజ్‌ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్‌, డీఈవో సుశీందర్‌రావులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు వివిధ పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన సైన్స్‌ ప్రయోగాలను వారు తిలకించి పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజలు విశ్వాసాలు, అంధ విశ్వాసాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని, బాల్య దశ నుంచే విద్యార్థులు తార్కిక ఆలోచనలు, నిశిత పరిశీలనలు, హేతుబద్ద వైఖరులను నిర్మాణాత్మకంగా రూపొందించుకోవాలని సూచించారు. మూఢ నమ్మకాలు, ఆశాస్త్రీయ దృక్పథాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా డీఈవో సుశీందర్‌రావు మాట్లాడుతూ నోబుల్‌ బహుమతి గ్రహీత సీవీ రామన్‌ 1928 ఫిబ్రవరి 28న ఎఫెక్ట్‌ కనుగొన్నారని, అనంతరం ఆప్రయోగానికి ప్రభుత్వం నోబుల్‌ పురష్కారం లభించిందన్నారు. 


సీవీరామన్‌ ఎఫెక్ట్‌ అనే ప్రయోగం ఫలితం వల్ల్లే  ప్రస్తుతం మనం విమానాశ్రయాల్లో తదితర చోట్ల దొంగతనంగా తరలించే బంగారం తదితర వాటిని ముందుగా పసిగట్టి పట్టుకోగల్గుతున్నామని పేర్కొన్నారు. లేజర్‌ కిరణాలను ఉపయోగించి పలు పరిశోధనలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ప్రశ్నించించడం, పరిశోధించడం నేర్చుకోవాలని సూచించారు. జనరల్‌ నాలెడ్జీ పుస్తకాలను బాగా చదివాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు కళాప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల నుంచి మొత్తం 120 సైన్స్‌ ప్రదర్శనలను విద్యార్థులు నిర్వహించారు. సైన్స్‌ ప్రదర్శనలు, క్విజ్‌ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జెడ్పీ చైర్మన్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంవో చంద్రశేఖర్‌, జిల్లా పరీక్షల అధికారి గణేశ్‌, ఎంఈవో లక్ష్మణ్‌ నాయక్‌, సర్పంచ్‌ అనిత, ఎంపీటీసీ శ్యామల, జీహెచ్‌ఎం శంకరయ్య, రవికుమార్‌, విద్యా కమిటీ చైర్మన్‌ మల్లేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రవికుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఊషన్న, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo