మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 20, 2020 , 04:40:20

నేటితో ప్రచారం బంద్‌

నేటితో ప్రచారం బంద్‌
  • -ప్రచారాలకు నేటితో తెర
  • -ముందంజలో గులాబీదళం
  • -నామమాత్రంగా ప్రతిపక్షాలు
  • -ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల, చిట్టెం
  • -ఓటరు తీర్పు ఏకపక్షమే..!

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక రోజు మాత్రమే మిగిలింది. సోమవారం సాయంత్రంతో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాలకు తెరపడుతుంది. దీంతో మైకుల మోతలన్నీ మూగపోయి ప్రశాంత వాతావరణం రానున్నది. ఏ కాలనీ చూసినా మైకు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. గడచిన ఐదు రోజుల నుంచి గల్లి..గల్లిలో ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలతో కాలనీలు హోరెత్తుతున్నాయి. జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 80 వార్డులకు గాను, జిల్లా కేంద్రంలోని 5వ వార్డు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. అయితే, 79 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో వనపర్తిలో 32 వార్డులు, పెబ్బేరులో 12, కొత్తకోటలో 15, ఆత్మకూరులో 10, అమరచింతలో 10 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.  జిల్లా వ్యాప్తంగా 342 మంది అభ్యర్థులు పోటీ చేస్తే, వీరిలో 89 మంది స్వతంత్ర అభ్యర్థులు కాగా, మిగిలిన వారంతా ఆయా పార్టీల నుంచి ఎన్నికల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాలు నిలిపి వేయాలనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నేటి సాయంత్రంతో మైకుల జోరుకు బ్రేక్‌ పడనుంది.

ముందంజలో గులాబీ దళం..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో గులాబీ దళం ముందంజలో ఉంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోను ప్రచారాలు జోరుగా చేపట్టారు. వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీల్లో మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అలాగే కొత్తకోటలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, ఆత్మకూరు, అమరచింతల్లో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌ రెడ్డిలు ప్రచారాల బాధ్యతలను భూజాన వేసుకున్నారు. ఈ కేంద్రాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ ద్వారా సభలను నిర్వహించి ముందంజలో ఉన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల వారీగా గెలుపు బాధ్యతలను మంత్రితోపాటు ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఏకపక్ష తీర్పు దిశగా..

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు ఏకపక్ష తీర్పు ఇచ్చే దిశగా కనిపిస్తుంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రచారాల్లో దూసుకుపోతుంటే, ప్రతిపక్షాలు ప్రచారాలను కూడా అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో చూసిన టీఆర్‌ఎస్‌దే పైచేయిగా ప్రచారాలు కొనసాగుతుంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగుతున్నందునా.. మున్సిపాలక వర్గాల్లోను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఉండటం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్న దిశగా ఓటర్లు ఆలోచిస్తున్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు అభివృద్ధి పనులు సాధించుకోవాలంటే గులాబీ పార్టీకే సాధ్యమన్న ఆలోచనలు ఓటర్లలో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాధాన్యత వివరాలను మంత్రి సింగిరెడ్డి ఇటీవల బహిరంగంగానే వివరించారు. అభివృద్ధికి పూచి నాదేనంటూ.. ఓటర్లు అపూర్వ విజయాన్ని అందించి ప్రత్యేకతను చాటుకోవాలనే సందేశం ఓటర్లకు చేరేలా చేశారు.logo
>>>>>>