మంగళవారం 09 మార్చి 2021
Vikarabad - Nov 11, 2020 , 04:20:19

సాదాబైనామాకు గడువు ముగిసింది

సాదాబైనామాకు గడువు ముగిసింది

సాదాబైనామాల క్రమబద్ధీకరణ గడువు మంగళవారంతో ముగిసింది. కాగితంపై రాత భూ ఒప్పందాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. మొదటగా 2016లో అవకాశం కల్పించగా వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా 5188 దరఖాస్తులు వచ్చాయి. రైతుల వినతిమేరకు ఈసారి మరో చాన్స్‌ ఇవ్వగా జిల్లాలో 3,851 దరఖాస్తులు అందాయి. అందులో కులకచర్ల మండలం నుంచి అత్యధికంగా 444 ఉన్నాయి.  వీటన్నింటినీ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించిన తరువాతనే రెగ్యులరైజ్‌ చేయనున్నారు. దీంతో ఏండ్ల తరబడి భూములపై ఎలాంటి హక్కులేని రైతులకు ప్రయోజనం కలుగనున్నది. అంతేకాకుండా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.  

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: తెల్లకాగితాలపై జరిగిన భూలావాదేవీల క్రమబద్ధీకరణకు సంబంధించి గడువు ముగిసింది. మంగళవారంతో సాదాబైనామాల రెగ్యులరైజ్‌ చేసుకునేందుకుగాను దరఖాస్తు గడువు పూర్తయ్యింది. అయితే కాగితాలపై జరిగిన భూ ఒప్పందాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ సాదాబైనామాల రెగ్యులరైజేషన్‌కు రాష్ట్ర ప్రభు త్వం మరో అవకాశాన్నిచ్చిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి సారి అధికారంలోకి వచ్చిన అనంతరం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశమిచ్చింది.  కొంతమందికి అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యతతో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోలేకపోవడం, సాదాబైనామాల రెగ్యులరైజేషన్‌కు మరో ఛాన్స్‌ ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చిన వినతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాదాబైనామాల రెగ్యులరైజేషన్‌కు నిర్ణయించారు. సెక్షన్‌ 22(2) చట్టం ప్రకారం 2014, జూన్‌ 2 లోపు సాదాబైనామాలను(తెల్లకాగితంపై ఒప్పందాలు) క్రమబద్ధీకరించనున్నారు. సాదాబైనామాల భూముల క్రమబద్ధీకరణ పూర్తయితే ఎన్నో ఏండ్లుగా సాగు చేస్తున్నప్పటికీ సంబంధిత భూములపై ఎలాంటి హక్కులు లేని రైతులకు అధికారిక హక్కులు రానున్నాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆస్తిపై విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులైతే సంబంధిత భూమి ని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి  చేసి రెగ్యులరైజ్‌ చేస్తారు. సాదాబైనామాల రిజిస్ట్రేషన్‌ను ఐదెకరాలలోపు వ్యవసాయ భూములకు సంబంధించి ఉచితంగా చేసేందుకు ప్రభు త్వం నిర్ణయించింది.  ఐదెకరాలకు పైబడిన వ్యవసాయ భూములకు మాత్రం స్టాంప్‌ డ్యూటీ, ఉచిత రిజిస్ట్రేషన్‌ మినహాయింపులు ఉండవు. రూపాయి ఖర్చు లేకుండా తమ కాగిత ఒప్పందాలను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకుగాను నిర్ణయించడంతో చిన్న, సన్నకారు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలోని కుల్కచర్ల మండలంలో అత్యధికంగా సాదాబైనామా క్రమబద్ధీకరణకుగాను దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆయా మండలాల్లో అందిన దరఖాస్తులకు సం బంధించి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, విచారించిన అనంతరమే రెగ్యులరైజ్‌ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 3851 మంది దరఖాస్తు చేసుకున్నారు. కుల్కచర్ల మండలంలో అత్యధికంగా 444 దరఖాస్తులు, దోమ లో 367 , వికారాబాద్‌ మండలంలో 362, దౌల్తాబాద్‌లో 267 , పెద్దేముల్‌ లో 262, బొంరాస్‌పేట్‌లో 257 , మోమిన్‌పేట్‌లో 234 , బంట్వారం లో 75 , బషీరాబాద్‌ లో 151 , ధారూర్‌ లో 188 , కొడంగల్‌లో 127 , కోట్‌పల్లి 118 , మర్పల్లిలో 194 , నవాబుపేట్‌ లో 127 , పరిగి లో 203 , పూడూర్‌ లో 114 , తాండూరు మండలంలో 213 , యాలాల లో 148 మంది సాదాబైనామాల రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.  2016లో రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశమివ్వగా జిల్లావ్యాప్తంగా 5188 దరఖాస్తులు వచ్చాయి.

సాదాబైనామాకు చెక్‌...

సాదాబైనామాలు అంటే తెల్ల కాగితాలపైనే భూక్రయవిక్రయాలు నిర్వహిస్తుండేవారు. అధికారికంగా ఎలాంటి పట్టా లేకుండా నమ్మకంతోనే భూలావాదేవీలు జరుగుతుండేవి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాల్లోనే క్రయవిక్రయాలు అధికంగా జరుగుతుండేవి. సాదా బైనామాలతో భూక్రయవిక్రయాలు జరిపిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే అధికంగా ఉన్నారు. ఇలాంటి సాదాబైనామా భూములను రెగ్యులరైజ్‌ చేయాలనే డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఏండ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంది. దీంతో భూవివాదాలు పెండింగ్‌లో ఉండి అధికమవడంతో సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకుగాను 2016లో అవకాశమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, తదనంతరం మరో అవకాశాన్నిచ్చింది. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకుగాను కేవలం నమ్మకమే పునాధిగా (సాదాబైనామా)తెల్లకాగితాలపై జరిగే భూక్రయవిక్రయాలను క్రమబద్ధీకరించాలన్న రాష్ట్ర ప్రభు త్వ నిర్ణయంతో రైతులకు యాజమాన్య హక్కులతోపాటు ఆ భూములను అధికారికంగా క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ పూర్తయినట్లయితే తమ తాతలు, తండ్రుల నుంచి వ్యవసాయ భూములను సాగు చేస్తూ అనుభవిస్తున్నప్పటికీ ఆ భూములపై హక్కు లు లేని రైతులకు తమ భూములపై అధికారిక భూ యాజమాన్య హక్కులు వస్తాయి. అంతేకాకుండా సాదాబైనామా ల క్రమబద్ధీకరణతో  పట్టాలులేని భూములు ఎన్ని ఉన్నాయనేది జిల్లా యంత్రాంగానికి పూర్తి అవగాహన వస్తుంది. అంతేకాకుండా ఐదెకరాలకు పైబడిన వ్యవసాయ భూము ల రిజిస్ట్రేషన్‌ ద్వారా ఆదాయం కూడా ప్రభుత్వానికి వస్తుం ది. అంతేకాకుండా రైతులు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందించే రైతుబంధు, రైతుబీమా పథకాల ప్రయోజనాలు కూడా  పొందవచ్చు.  తెలిసో తెలియకో తెల్లకాగితాలపై భూములను కొనుగోలు చేసి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆందోళనలో ఉన్న రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పూర్తి భరోసానిచ్చింది. 

ప్రభుత్వ ఆదేశాలు రాగానే పరిశీలన - అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

సాదాబైనామాల క్రమబద్ధీకరణకుగాను సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన అనంతరం దరఖాస్తుల విచారణ చేపడుతామని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లయితే 20 రోజుల్లో దరఖాస్తుల విచారణ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా సాదాబైనామాల క్రమబద్ధీకరణకుగాను ప్రభుత్వం మరో అవకాశమివ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, 2016లో అవగాహనలేక దరఖాస్తు చేసుకోలేని వారు ప్రస్తుతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అదనపు కలెక్టర్‌ వెల్లడించారు. VIDEOS

logo