గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - May 16, 2020 , 00:29:38

పెరుగనున్న కంది సాగు

పెరుగనున్న కంది సాగు

  • మరో 40 వేల ఎకరాలు పెంచేందుకు అధికారుల కసరత్తు
  • ఈ ఏడాది 1.70 లక్షల ఎకరాలు లక్ష్యం 
  • పరిగి, వికారాబాద్‌ డివిజన్లలో సాగుకు చర్యలు 
  • 30 శాతం తగ్గనున్న పత్తి పంట..
  • కేవలం నల్లరేగడిలో సాగుకు నిర్ణయం 
  • వరిలో సన్నరకానికి ప్రాధాన్యం 
  • పలు మండలాల్లో కూరగాయ పంటలు 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా రైతాంగానికి లాభాన్ని చేకూర్చడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులు ప్రభుత్వం సూచించిన పంటనే సాగు చేయాలని, పంట మార్పిడితో లాభాలు ఆర్జించొచ్చనే ఉద్దేశంతో ఈ వానకాలం సీజన్‌ నుంచే ఏ పంట సాగు చేయాలనేది సూచించనున్నారు. జిల్లాలో నల్లరేగడితో పాటు ఎర్రనేలలు కూడా ఉండటంతో ఆయా నేలల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. ఏ పంటల సాగు పెంచాలనే దానిపై జిల్లా వ్యవసాయాధికారులు కసరత్తు చేస్తున్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా జిల్లాలో కంది పంట సాగును పెంచేందుకు నిర్ణయించారు. కంది పంటతో పాటు వరిలో సన్నరకం సాగును పెంచేందుకు రైతులను ప్రోత్సహించనున్నారు. కంది సాగును పెంచనుండటంతో పత్తి పంట సాగును 30 శాతం మేర తగ్గించనున్నారు. అధిక పెట్టుబడి, కూలీల కొరత తదితర సమస్యలను ఎదుర్కొంటున్నందున పత్తి సాగును తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. మరోవైపు కూరగాయల సాగును కూడా పలు మండలాల్లో పెంచేందుకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వ్యవసాయాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం గ్రామాల వారీగా వ్యవసాయాధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించనున్నారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా లాభాలు పొందేలా, మద్దతు ధర అందేలా ప్రభుత్వం నిర్ణయించినందున రైతులంతా సూచించిన పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు కోరుతున్నారు.

కందికి అనుకూలం..

జిల్లా కంది పంట సాగుకు అనుకూలం. కాబట్టి సాగును పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. గతేడాది వానకాలం సీజన్‌లో 52,375(1.30 లక్షల ఎకరాలు) హెక్టార్లలో సాగైన కంది పంటను ఈ సారి 30శాతం పెంచనున్నారు. ముఖ్యంగా వికారాబాద్‌, పరిగి డివిజన్లలో కందిసాగును పెంచడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సీజన్‌లో 75 వేల హెక్టార్లకు(1.70 లక్షల ఎకరాలు) కంది సాగును పెంచనున్నారు. ఇప్పటికే తాండూరు డివిజన్‌లో అధిక మొత్తంలో కంది సాగు చేస్తుండగా, మిగతా డివిజన్లలో పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఎర్రనేలల్లో పూర్తిగా కంది పంటను సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించనున్నారు. యాలాల, పరిగి, దోమ, కులకచర్ల మండలాల్లో ఎర్రనేలల్లో సాగవుతున్న పత్తి పంట స్థానంలో కంది పంటను వేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. నల్లరేగడి నేలలు ఉన్న పూడూరు, వికారాబాద్‌ మండలాల్లో కూడా పత్తి, మొక్కజొన్న పంటలతోపాటు అంతర పంటగా కందిని సాగు చేసే విధంగా రైతులకు ఊరూరా అవగాహన కల్పించనున్నారు. దేశంలో తాండూరు కంది పప్పు ప్రసిద్ధి కాబట్టి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేకుండా, ఇతర రాష్ర్టాలకు, దేశాలకు పప్పు ధాన్యాలను ఎగుమతి చేయడమే లక్ష్యంగా కంది సాగును లక్ష్యానికి అనుగుణంగా పెంచనున్నారు.

సన్నరకం వరికి ప్రాధాన్యం...

జిల్లాలో సన్నరకం వరి సాగును పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం వరి 31,063 ఎకరాల్లో సాగు అవుతున్నది. వీటిలో చాలావరకు దొడ్డు రకం పంటనే సాగు చేస్తున్నారు. ఈ వానకాలం నుంచి వరిలో సన్న రకం పంటను 18,638 ఎకరాలకు, దొడ్డు రకాలను 12,425 ఎకరాల్లో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనున్నారు. జిల్లాలో బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా, శ్రీరామ గోల్డ్‌, మహీంద్రా వంటి సన్న రకాలను సాగు చేయాలని అధికారులు రైతులకు సూచించనున్నారు. సన్నరకం వరి సాగుకు దొడ్డు రకం వరితో పోలిస్తే 28 రోజుల కాలపరిమితి ఎక్కువగా ఉంటుంది. సన్న బియ్యానికి అధిక డిమాండ్‌ ఉన్న దృష్ట్యా రైతులు సన్న రకం వరి సాగు వైపు మళ్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

తగ్గనున్న పత్తి సాగు...

కంది పంట సాగును పెంచనుండటంతో ఆ మేరకు పత్తి సాగు తగ్గనుంది. పత్తి రైతులు ప్రతి ఏటా నష్టాల పాలవుతుండటంతో సాగును తగ్గించేందుకు వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఎర్ర నేలలున్న యాలాల, కులకచర్ల, దోమ, పరిగి మండలాల్లో రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. ఈ మండలాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తికి బదులుగా కంది పంటను సాగు చేయించే విధంగా అధికారులు ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో పోయిన వానకాలం సీజన్‌లో 77 వేల హెక్టార్లలో సాగైన పత్తి పంటను ఈ సారి 30 శాతం మేర తగ్గించి 50 వేల హెక్టార్లలోపు పత్తి పంట సాగయ్యేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. 

కూరగాయల సాగుకు ప్రాధాన్యం...

జిల్లాలో కూరగాయల సాగును కూడా ఈ సీజన్‌ నుంచి పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానంగా బంగాళదుంపతోపాటు బీర, సొర, కాకర, బెండకాయ సాగును పెంచేలా రైతులను ప్రోత్సహించనున్నారు. జిల్లాలోని మోమిన్‌పేట్‌, నవాబుపేట్‌, పరిగి, దోమ మండలాల్లో కూరగాయల సాగు పెంచడంపై జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మర్పల్లి మండలం బంగాళదుంప సాగుకు అనుకూలం. అయినప్పటికీ మండలంలోని కొన్ని గ్రామాల్లోనే ఈ పంటను సాగు చేస్తుండగా అన్ని గ్రామాల్లో బంగాళదుంప సాగు పెంచాలని యోచిస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు 478టన్నుల బంగాళదుంపలు అవసరమని అంచనా వేసిన అధికారులు ప్రస్తుతం 438 టన్నులు మాత్రమే సాగవుతున్నందున సాగును పెంచేందుకు నిర్ణయించారు. 


logo