శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - May 11, 2020 , 01:37:20

సాగుకు సమాయత్తం

సాగుకు సమాయత్తం

  • 2 లక్షల పైగా హెక్టార్లలో పంటల సాగు అంచనాలు
  • 63,187 మెట్రిక్‌ టన్నుల ఎరువుల ప్రతిపాదనలు
  • 7200 క్వింటాళ్లరాయితీ విత్తనాలు 
  • వానకాలం పంటకు అధికారుల సన్నాహాలు 

పరిగి : జిల్లా పరిధిలో రైతులు వానకాలం పంటల సాగుకు సమాయత్తమవుతుండగా, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు విత్తనాలు, ఎరువులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. జిల్లా పరిధిలో 2.25లక్షల మంది రైతులు ఉండగా, 2019 వానకాలంలో 1.92 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఈసారి సాగు మరో పది శాతం పెరిగి, 2.10 లక్షల హెక్టార్లకు చేరవచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 

జిల్లా పరిధిలో పత్తి, కందులు, వరి, మొక్కజొన్న, పెసర, మినుము పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు 7,200 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు, 63,187 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.  

పెరుగనున్న సాగు విస్తీర్ణం...

కిందటి ఏడాదితో పోలిస్తే జిల్లా పరిధిలో ఈసారి అన్నిరకాల పంటల సాగు పెరుగనుంది. పోయినసారి అన్ని పంటలు కలిపి 1.92 లక్షల హెక్టార్లలో సాగు చేయగా, అత్యధికంగా పత్తి 77,524 హెక్టార్లు, కంది 52,376 హెక్టార్లు, మొక్కజొన్న 30,044 హెక్టార్లు, వరి 12,424 హెక్టార్లు, పెసర 7,019 హెక్టార్లు, జొన్న 4,592 హెక్టార్లు, మినుములు 3,200 హెక్టార్లు, చెరుకు 2,621 హెక్టార్లలో సాగయ్యాయి. గతేడాది సాధారణ సాగు కంటే 112 శాతం అధిక విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు కాగా, ఈసారి సాగు విస్తీర్ణం మరో పది శాతం పెరుగనుంది. పత్తి పంటను వికారాబాద్‌, మర్పల్లి, కోట్‌పల్లి, పూడూరు, కొడంగల్‌, తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో అధికంగా సాగు చేయగా, కందులను తాండూరు నియోజకవర్గం, కొడంగల్‌ ప్రాంతాలలో అత్యధికంగా, పరిగి, వికారాబాద్‌ ప్రాంతాలలోను కొంతమేరకు విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.

63,187 మెట్రిక్‌ టన్నుల ఎరువులు...

జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో సుమారు 63,187 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించారు. ఏప్రిల్‌ మొదలుకొని సెప్టెంబర్‌ వరకు ప్రతినెలవారీగా అవసరమయ్యే ఎరువుల ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించారు. యూరియా 24,165 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 18,150 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 8,706 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 11,116 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1,050 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయి. సీజన్‌ ప్రారంభానికి జిల్లాలోని పలుచోట్ల బఫర్‌ స్టాక్‌ ఉంచడం ద్వారా ఎరువుల ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు అవసరం మేరకు ఎప్పటికపుడు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే మొత్తం 7,200 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అందించేందుకు అధికారులు ప్రతిపాదించగా వాటిలో వరిలో నాలుగు రకాలు కలిపి 1,700 క్వింటాళ్లు, జొన్న 500 క్వింటాళ్లు, కందులు 300 క్వింటాళ్లు, మినుములు 200 క్వింటాళ్లు, ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు కొంత మొత్తంలో ఉన్నాయి.

సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచుతాం..

  • గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లా పరిధిలో వానకాలంలో సాగు చేసే పంటలకు అవసరమయ్యే ఎరువులు అందుబాటులో ఉంచుతాం. సాగు ప్రారంభానికి ముందే పలుచోట్ల బఫర్‌ స్టాక్‌ ఏర్పాటు చేస్తాం. నెలవారీగా ఎరువుల అవసరంపై ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ఆ మేరకు జిల్లాకు ఎరువులు రానున్నాయి. 


logo