శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Feb 09, 2020 , 23:54:17

32వేల మెట్రిక్‌ టన్నల ధాన్యం సేకరణ

32వేల మెట్రిక్‌ టన్నల ధాన్యం సేకరణ
  • జిల్లాలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • కస్టమ్‌ మిల్లింగ్‌కు 31మిల్లుల ఎంపిక, ధాన్యం తరలింపు
  • 8,100 మంది రైతుల నుంచి సేకరణ
  • రూ.58.89కోట్ల చెల్లింపులు

పరిగి, నమస్తే తెలంగాణ : రైతులు పండించిన పంటల ను ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా మద్దతు ధర కల్పించాలన్నది సర్కారు ప్రధాన ఉద్దేశం. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి మంచిరోజులు వచ్చాయని చెప్పవచ్చు. రైతులు పంటలు పండించేందుకు అవసరమైన పెట్టుబడి సాయం అందించడం దగ్గర నుంచి పండించిన పంటలను కొనుగోలు చేసేంత వరకు ప్రభుత్వం రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. తద్వా రా వ్యవసాయం దండగ నుంచి వ్యవసాయం పండుగ అనే పరిస్థితిని ప్రభుత్వం తీసుకువచ్చింది. గతంలోని ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా నామమాత్రమేనని చెప్పవచ్చు. అప్పట్లో రైతులు తాము పండించిన పంటలు కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి. టీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలును అత్యంత పారదర్శకంగా చేపడుతుంది. కొనుగోలు చేసిన వాటికి సంబంధించిన డబ్బులు సైతం నాలుగైదు రోజులలో రైతుల ఖాతాలలో జమ చేయడం ద్వారా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. ఈసారి వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 30ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టింది. డిసెంబర్‌ 16వ తేదీన ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు ఈనెల ప్రారంభం వరకు కొనసాగాయి. 30కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 32, 100 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ. 1,835, కామన్‌ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 1,815అందజేయడం జరిగింది. 


32,100 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లా వ్యాప్తంగా 30ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 32,100మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టారు.  పరిగి, తాండూరు, కులకచర్ల, దోమ, బషీరాబాద్‌, యాలా ల్‌ మండలం తిమ్మాయపల్లి, కొడంగల్‌ మండలం హస్నాబాద్‌, యాలాల్‌, యాలాల్‌ మండలంలోని జుంటుపల్లి, బాగాయిపల్లి, అక్కంపల్లి, రాస్నం, లక్ష్మీనారాయణపూర్‌, పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌, దోమ మండలం దాదాపూర్‌, ధారూర్‌ మండలం నాగారం, బొంరాస్‌పేట్‌ మండలంలోని బొంరాస్‌పేట్‌, నాగిరెడ్డిపల్లి, మెట్లకుంట, ఏర్పుమల్ల, దుద్యాల, దౌల్తాబాద్‌, దౌల్తాబాద్‌ మండలంలోని బలంపేట్‌, నందారం, కొడంగల్‌, కొడంగల్‌ మండలం నందిగామ, కులకచర్ల, కులకచర్ల మండలంలోని చౌడాపూర్‌, దోమ మండలం పాలేపల్లి, ధారూర్‌లలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 8,100మంది రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 58. 89కోట్లు రైతులకు చెల్లించడం జరిగింది. రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలలో ధాన్యానికి సంబంధించిన డబ్బులు జమ చేయబడ్డాయి. తద్వారా జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన పూర్తిస్థాయి డబ్బులు రైతులకు అందాయి. 


కస్టమ్‌ మిల్లింగ్‌కు 31 రైస్‌మిల్లులు 

కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్‌ మిల్లింగ్‌ చేసేందుకు జిల్లాలో 31 రైస్‌మిల్లులను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేపట్టిన 32100 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం 31రైస్‌మిల్లుల తరలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలను కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించడం జరిగింది. రైస్‌మిల్లులకు ధాన్యం బస్తాలు చేరిన 15రోజులలో కస్టమ్‌ మిల్లింగ్‌ పూర్తి చేసి బియ్యాన్ని సూచించిన గోదాముకు చేరవేయాల్సి ఉంటుంది. రైస్‌మిల్లులకు తరలించిన 32100మెట్రిక్‌ టన్నుల ధాన్యం కస్టమ్‌ మిల్లిం గ్‌ తర్వాత సుమారు 26వేల మెట్రిక్‌ టన్నులు(67శాతం) బియ్యం పౌర సరఫరాల శాఖ వారికి అందజేయాల్సి ఉం టుంది. ఇందులో ఇప్పటి వరకు ఆయా రైస్‌మిల్లుల నుంచి 10,400 మెట్రిక్‌ టన్నుల బియ్యం పౌర సరఫరాల శాఖ గోదాములకు చేరింది. మిగతాది త్వరలోనే అందజేయనున్నట్లు తెలిసింది. కస్టమ్‌ మిల్లింగ్‌ పూర్తయిన అనంతరం జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగిలలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాములలో బియ్యం స్టాకు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ తదితర పనులన్నీ పారదర్శకంగా జరిగేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కస్టమ్‌ మిల్లింగ్‌ చేసే రైస్‌మిల్లులను జియో ట్యాగింగ్‌ చేయడం జరిగింది. ఏదిఏమైనా ధాన్యం కొనుగోళ్లు అత్యంత పారదర్శకంగా జరిగాయని చెప్పవచ్చు. logo