ఇంటి స్థలం ఈశాన్యం పెరిగి ఉంది. ఇల్లు కూడా అలాగే పెంచి కట్టాం. కొందరు ‘మంచిది!’ అంటున్నారు. మరికొందరు ‘తప్పు!’ అంటున్నారు. ఏది నిజం?
– వి. శాంతి, కొలనుపాక
మీరు సొంత ఆలోచనతో.. అక్కడక్కడ చూసి, చదివి ఇల్లు కట్టుకున్నారు. ఆరోగ్యం విషయంలో, ఇంటి విషయంలో సొంత వైద్యం మంచిదికాదు. మీరే కాదు.. చాలామంది వాస్తును తేలికగా తీసుకొని, ఆస్తులు అమ్ముకొని పోయారు. స్థలంలో ఈశాన్యం పెరిగి ఉంటుంది. అది స్థలం వరకే పరిమితం. ఈశాన్యం పెరగడం మంచిది అనే భావన.. ఇంటి నిర్మాణంలో సరైనది కాదు. ఇల్లు ఈశాన్యం పెంచి కట్టవద్దు. అలాగే, ఇంటికి ఈశాన్యం తెంపు చేసి కూడా కట్టకూడదు. అక్కడ పెంచాం.. మంచిది అంటారు. ఇక్కడ ఓపెన్ పెట్టాం.. మంచిది అంటారు. రెండూ తప్పే! శాస్త్రం తెలుసుకుని కట్టాలి. మీరు నేల మీద ఇల్లు కట్టారు కాబట్టి, ఇంటి ఈశాన్యం గోడ తొలగించి, మెట్నకు కట్టండి. లేనట్లయితే, ఇంటిలో నైరుతి – ఈశాన్యం పెరిగి, మున్ముందు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వెంటనే సరిచేసుకోండి.
చెరువుల పక్కన ఇండ్లు కడితే తీసుకోవచ్చా?
– బి. శ్రీకాంత్, అమ్మనబోలు
పంచభూతాల సమతుల్యత ఉన్నపుడే దానిని శాస్త్రగృహం అంటారు. వంటలో సమతూకం ప్రాధాన్యత వహించినట్టే.. ఇంటికీ వర్తిస్తుంది. నూనె అధికంగా పోసి వండినంత మాత్రానో, మసాలాలు ఎక్కువ వేసినంత మాత్రానో.. వంటకు రుచిరాదు. ఏ దినుసు ఎంత వేయాలో.. అంతే వేయాలి. నీరు – ఆకాశం – భూమి – అక్కడి ఉష్ణోగ్రత (వెలుగు) – వాయు గమనాలు చూసి, ఇంటి నిర్మాణం చేపడతాం. చెరువులు, కుంటలు, సముద్రం అనేవి ఇంటిని మించిన వైశాల్యంతో ఉన్నప్పుడు, తప్పకుండా వాటి ప్రభావం ఇంటిమీద ఉంటుంది. పంచభూతాలలో నీరు సవ్య దిశలోనే ఉన్నా.. సముద్ర తీరంలో, చెరువు గట్టున ఇల్లు కట్టుకోవడం మంచిదికాదు. ఇంటికి ఎంత వాస్తు ఉన్నా.. అక్కడి సహజసిద్ధమైన ప్రకృతి వాస్తు డామినేట్ చేసి, వ్యక్తి శక్తిని నిర్వీర్యం చేస్తుంది. అది ఆరోగ్యపరంగా, ఆలోచనాపరంగా కుంగదీస్తుంది.
ఫామ్‌హౌజ్‌కు వాస్తు వర్తిస్తుందా? అక్కడ రోజూ ఉండం కదా!?
– శ్రీహరి, కందుకూరు
తప్పక వర్తిస్తుంది. ఇప్పుడు పండుగల వేళ, శుభకార్యాల వేళ అందరూ కలుసుకునే స్థానం అదే కదా! పొలంలో కట్టినా.. అదీ గృహమే. ప్రధానంగా వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టాలంటే ఎత్తయిన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అది క్షేత్రానికి నడుమ ఉన్నా.. పశ్చిమ, దక్షిణ దిశల్లో ఉన్నా మంచిదే! అయితే, దానికి తప్పకుండా కాంపౌండు నిర్మాణం ఉండి తీరాలి. కాలువలు, పెద్దపెద్ద బావులు ఉన్నట్లయితే, వాటికి దూరంగా అంటే, అవి తూర్పునకు, ఉత్తరానికి ఉండేలా జరిగి, నిర్మాణ స్థలం ఎంచుకోవాలి. తప్పక దిశకు స్థలం కుదిరించి, అందులో నూతన గృహాన్ని శాస్త్రబద్ధంగా కట్టుకోవాలి. నిర్మాణం ఏదైనా.. వాస్తుకు అతీతం కాదు.
ఆగ్నేయంలో నీరు ఉండకూడదు అంటారు కదా! వాష్ ఏరియాను ఆగ్నేయంలో ఇవ్వొచ్చా? మా ఫ్లాట్‌కు ఇలాగే ఉంది.
– డి. చంద్రం, చిలుకూరు
నిజానికి నీరు అంతటా ఉంటుంది. ఉండొచ్చు కూడా. భూమిలో ఏ దిశలోఅయినా నీరు ఉంటుంది కదా! అయితే, దానిని ఎక్కడినుంచి తీసుకొని, ఎక్కడ వాడాలి? అనేది మనం నిర్ణయించుకోవాలి. వ్యవహారపరంగా – అనుకూలత – వసతి – హానిలేని విధానం.. వాస్తులో ప్రాధాన్యం. దానిని మనం అర్థం చేసుకోవాలి. ఇంటిలో వంటగది ఆగ్నేయంలో వస్తుంది. దానికి దక్షిణ ఆగ్నేయంలో యుటిలిటీ (వాష్ ఏరియా) పెట్టుకోవచ్చు. వంట తూర్పు-ఆగ్నేయంగా ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిన చోటు సరైనదే! దోషం లేదు. అంతేకాదు.. అపార్ట్మెంట్లలో దక్షిణ – ఆగ్నేయంలో వాష్ ఏర్పాటు చేసి, ట్యాప్ పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషిన్ కూడా పెట్టుకొని, పనులు చేసుకోవచ్చు. అయితే, ఆ యుటిలిటీకి ఇనుప గ్రిల్ ఉండాలి.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678