ఇంట్లో విగ్రహాలు పెట్టి పూజించడం సరైన విధానం కాదని అంటున్నారు.అది నిజమేనా?
– వి. సుజాత, జగిత్యాల.
Vastu Shastra | ఎవరికి వారు.. తామే అన్నీ తెలిసిన వాళ్లమని అనుకుంటారు. తోచింది ఏదో చెబుతుంటారు. అవన్నీ నిజాలు అని మనం ఎందుకు అనుకోవాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ, వ్యక్తమయ్యే ‘రూపం’ ఉన్నప్పుడే మనం ఆ విగ్రహాన్ని చూస్తూ మన మనసు నిలుపుకొనే ప్రయత్నం చేస్తాం. పూజ, సంకీర్తన, అర్చన.. ఇత్యాదులన్నీ మన చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికే. తద్వారా ఆ వ్యక్తి, సానుకూల భావనతో జీవించగలుగుతాడు. ఆవాహన అనే ఒక ప్రక్రియ ఉంది. అది అత్యంత విజ్ఞానపూరితంగా ఉంటుంది. అంతటా ఉన్న శక్తిని విగ్రహంలోకి తీసుకొని రావడం. దానికి మన భావబలం, మంత్రబలం తోడుకావాలి. అప్పుడు శక్తి.. విగ్రహాలలో ఉత్పన్నం అవుతుంది. ఇంట్లో కానీ, ఆలయాలలో కానీ విగ్రహాలకు శక్తి ఉంటుంది. అది మన భావబలంతోనే సమకూరుతుంది. ఆలయాలలో ఒక విధానం (ప్రాసెస్)తో విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తారు. వాటిని ఊరికే కొట్టి పారేయకూడదు. చాలా లోతైన విజ్ఞాన విధానం అది. పాజిటివ్ ఎనర్జీని మనం విగ్రహం ద్వారా పొందుతాం. అంతెందుకు.. తులసి మొక్క చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే, ఇళ్లల్లో అంతగా నిలిచిపోయింది. మీరు అడిగిన విషయం ఎంతో విపులంగా చెప్పాల్సింది. కాబట్టి, దానిపట్ల మీకు వక్రదృష్టి వద్దు. మన పూర్వీకులు మనం చెడిపోవాలని ఆ పద్ధతులు పెట్టలేదు. చైతన్యవంతం కావాలని చెప్పారు. అవి పాటించడం వల్ల బాగుపడేది మనమే!
ఇంటి కిందిభాగంలో సగం పార్కింగ్, సగం ఆఫీస్ పెట్టుకోవచ్చా? పైన ఇంట్లోకి ఆఫీస్ నుంచి వెళ్లొచ్చా?
– వి.ఎన్. కిరణ్, బైరామల్‌గూడ.
కిందిభాగం మొత్తం ఓపెన్ పెట్టుకొని, ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకోవడం వల్ల దోషంలేదు. అయితే.. పైన ఉండే ఇంటిలోకి స్లాబు బయటినుంచి వాయవ్యంలో లేదా ఆగ్నేయంలో మెట్లు పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. స్టిల్ట్ భాగం.. అదే కింది భాగంలో నైరుతిలో ఒక ఆఫీస్‌ను అవసరమైనంత స్థలం తీసుకొని కట్టుకోవచ్చు. ఆ ఆఫీస్ స్థలం పోను మిగతా భాగం పార్కింగ్ పెట్టుకోవచ్చు. అయితే.. ఆఫీస్ నుంచే మెట్లు పెట్టుకొని ఫస్ట్ ఫ్లోర్‌లోకి వెళ్లకూడదు. తద్వారా ఇంటి పైభాగం నుంచి కిందికి నైరుతి నుంచి నడక వచ్చి.. పెద్దదోషం అవుతుంది. కింద ఆఫీస్, పైన ఇల్లు సపరేటుగా ఉండటం మంచి విధానం. అప్పుడు ఇంటికి ప్రైవసీతోపాటుగా వాస్తుదోషం కూడా లేకుండా ఉంటుంది. అన్నీ సరిగ్గా ఆలోచించి ఇల్లు కట్టుకోండి.
ఇంటి చుట్టూ వదిలే ఖాళీ.. ఇతరుల ఇండ్లకు వీధిపోటు అవుతుందా?
– వి. సాగర్, లోతుకుంట.
ఈలోకంలో ఎవరు ఎంత పెద్ద ఇల్లు కడతారో.. ఎవరు ఏ చిన్న ఇంట్లో సర్దుకొని జీవిస్తారో చెప్పడం కష్టం. ఎవరి అవసరాలు వారివి. ఎవరి ఆర్థిక స్థితులు వారివి. శాస్త్రం.. అందరూ ఇంతే వైశాల్యంలో ఇండ్లు కట్టాలి అని చెప్పలేదు. అలా అయితే.. రాజుల గృహాలు, సత్రాలు, మఠాలు, మందిరాలు అంత విభిన్న వైశాల్యంలో ఎందుకు ఉంటాయి? కాంపౌండు లోపలి ఖాళీ స్థలం.. ఎదురుగా కట్టిన ఇంటికి పడమర తగిలినా.. నైరుతిలో తగిలినా.. అది పోటుకాదు – చూపుకాదు. ఎలాంటి దోషంకాదు. కొందరు అతిగా ఆలోచించి, వాటిని పక్కింటి సందిపోటు అంటారు. అవి వీధులు కావు. వాటిని ఓపెన్ ప్లేస్, ఇంటి చుట్టూ వదిలిన ఆవరణగా భావించాలి. ‘మీ పక్కింటి ఆయన లావుగా ఉన్నాడు. నువ్వెందుకు సన్నగా ఉన్నావు?’ అన్నట్లు ఉంటుంది ఈ మాట. ఒక స్థలంలో మూడు ఇండ్లు కట్టుకొని.. అదే స్థలం వెనక ఆ మూడు ఇండ్ల స్థలంలో ఒక్కటే ఇల్లు కడితే.. ఎదుటి ఇండ్ల మధ్య ఖాళీ స్థలం వీళ్లకు దోషం అని కొందరు అనుకోవడం తప్పు. ఎవరు ఏ స్థాయిలో ఇండ్లు కట్టుకున్నా.. శాస్త్ర ప్రకారం కట్టుకుంటే చాలు.
అనాథ, వృద్ధుల కోసం ఆశ్రమాలను ఎలా కట్టాలి? వాళ్ల నివాసం ఎలా ఉన్నా ఫరవాలేదా?
– ఎం. చంద్రశేఖర్, ఘట్కేసర్.
నిర్మాణం ఏదైనా.. నిర్లక్ష్యం పనికిరాదు. చిన్న గొర్రెల షెడ్డు అయినా.. బాతుల పాక అయినా.. వాటి ప్రాధాన్యతలు వాటికి ఆపాదిస్తూ కడతాం. అలాంటిది.. ‘వృద్ధాశ్రమాలు’ అనగానే, తక్కువ భావన ఎందుకు? అసలు వాళ్ల గురించే ఎక్కువ ఆలోచించాలి. బాధాకరమైన విషయం ఏమిటంటే.. సంతానం యోగ్యమైనదైనా, ఇంకా ఇంకా అనాథ ఆశ్రమాలు, పెద్దల ఆవాసాలు పెరుగుతుండటం. పెద్దవాళ్లు తక్కువసేపు నిద్రిస్తారు. ఎక్కువసేపు కూర్చుని ఉంటారు. మంచాల మీద ఒరిగినా.. వాళ్లు సరిగ్గా నిద్రపోరు. కాబట్టి, చెట్లు, పచ్చదనం, పూలు – పండ్లుకాసే చెట్ల మధ్య, విశాలమైన కోర్టు యార్డుతో.. చుట్టూ గదులు ఉండి, వాటిని అనుసరిస్తూ పొడవైన, విశాలమైన వరండా ఉండి.. జారని, వర్షం పడని ఫ్లోరింగ్, పిరమిడ్ పైకప్పులతో.. గాలి – వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మాణం చేయాలి. ఖాళీ భాగం ఎక్కువగా ఉండేలా.. వాళ్లు అన్నీ మరిచి ఆనందంగా గడిపేలా ఆ ప్రదేశాన్ని దిశలకు కుదిరించాలి. అంటే.. ఆరోగ్యప్రధానంగా నిర్మాణం చేపట్టాలి. మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143