కింద ఆఫీస్, పార్కింగ్ ఏర్పాటు చేసుకొని, పైన ఇల్లు కట్టుకుంటే.. పైకివెళ్లే మెట్లు ఎక్కడ పెట్టాలి? తూర్పులో పెట్టుకోవచ్చా?
– ఎం. జనార్దన్, చేర్యాల.
Vastu Shastra | నేలమీద ఇల్లు ఉండాలి. అన్ని సౌకర్యాలూ కలిగి ఉండాలి. ఉన్న స్థలం పరిమితం. ఇది అందరి సమస్య. ఇది పెద్ద ఇబ్బందికాదు. పైకి వెళ్లడానికి కిందినుంచి కాకుండా.. ఆగ్నేయం, వాయవ్యంలో మెట్లు పెట్టుకోవాలి. కింద ఆఫీస్, స్టాఫ్ గదులను దక్షిణం లేదా పశ్చిమంలో కట్టుకోవాలి. తూర్పులో లేదా ఉత్తరంలో పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఎంతో సౌకర్యంగా, వాస్తుగా ఉంటుంది. కిందినుంచే మెట్లు పెట్టకుండా.. అంటే పైభాగంనుంచి కిందికి దిగకుండా, బయటినుంచి బయటకే వాడటం మంచిది. కానీ, ఉత్తరం తెంపు చేసి లేదా తూర్పు మధ్యభాగం తెంపుచేసి పైకివెళ్లే మెట్లు పెట్టవద్దు. అది తలలేని గృహం అవుతుంది. లేదా కిందినుంచి మూడు అంతస్తుల డూప్లెక్స్ భవనం కట్టుకోవాలి. ఏమూల కూడా తెంపకుండా.. తూర్పులో ఎక్కువ ఖాళీభాగం వదిలి, కార్ పార్కింగ్ తదితర అవసరాలకు ప్లాన్ చేయాలి. మంచిగృహం కోసం శాస్ర్తాన్ని అనుసరించక తప్పదు.
ఇంట్లో ఒకే టాయిలెట్ రావాలి అంటే.. ఎటుదిక్కు పెట్టాలి?
-ఎ. అరవింద కుమార్, పారుపల్లి.
ఇంటిని విభజించడంలో ముందుగా పడక గదులు, వంటగది, హాలు, గృహ ద్వారాలు.. అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఇక టాయిలెట్ ఒకటి, రెండు అనేది మీ ఇష్టానుసారం పెట్టుకోవచ్చు. ఒక టాయిలెట్ అంటే అది ఇంటి మొత్తానికీ దక్షిణంలో లేదా పశ్చిమంలో పెట్టుకోవచ్చు. అది అందరూ వాడుకునేలా అనుకూలంగా ఉండాలి. అంటే.. రెండు పడక గదుల మధ్యలో పెట్టండి. నైరుతిలో బెడ్రూమ్, వాయవ్యంలో ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసుకొని, వాటి మధ్యలో పెట్టవచ్చు. అప్పుడు అది పడమర టాయిలెట్ అవుతుంది. లేదా దక్షిణంలో హాల్ నుంచి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇంటి బయట కూడా ఆగ్నేయ వాయవ్యంలో పెట్టుకోండి. ఒక టాయిలెట్ కేవలం ప్రధాన పడక గదిలోనే రావాలి అంటే.. అది ఇతరులు వాడుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఒక్క టాయిలెట్ పెడితే.. అది ‘కామన్’గా ఉండాలి.
మాకు ఒక్కడే అబ్బాయి. వాడికి సంతానం లేదు. లోపం ఎక్కడ ఉంది? మమ్మల్ని ఏం చేయమంటారు?
– వి. స్మిత, భువనగిరి.
సంతాన స్థానం అనేది గృహంలో ఈశాన్యం ప్రాధాన్యతగా ఉంటుంది. ఒక తండ్రితరం చాలాకాలం (ఏళ్లు) ఈశాన్యం లేని.. లేదా ఈశాన్యం మూతపడి ఉన్న ఇంటిలో నివసించినప్పుడు ఆ ఇంటిలోని మగపిల్లలు అంటే.. అన్నదమ్ములలో ఎవరికో ఒకరికి సంతానం రాకుండా పోయే అవకాశం ఉంది. ప్రధానంగా చిన్నవాళ్లలో! ఒక్కోసారి తండ్రి ప్రభావం అంటే.. తండ్రి ఉన్న ఇంటి ప్రభావం అతని సంతానం పైకి వస్తుంది. అంటే.. వంశం ఒకచోట ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు మీ ఊరిలోని గృహాలకు ఈశాన్యం లోపం ఉంటే సరిచేసుకోండి. ‘ఈశాన్యం తెంపు.. సంతతికి ముంపు’ అనేది శాస్త్రవచనం. గృహపరంగా అన్నిచోట్లలో మార్పులు జరగాలి. అనేక గృహాలలో ఈశాన్య లోపం ఉండవచ్చు. ఆ తరువాత సంతానం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కాలపరిమితి లేదు.
ఒకే నైరుతి గదిలో ఇద్దరు కూర్చోవచ్చా?
– వి.ఎల్. రామదాసు, నిజామాబాద్.
సాధారణంగా.. ఆఫీసుల్లో ఇలా అన్నదమ్ములు, తండ్రీకొడుకులు కూర్చుంటూ ఉంటారు. నైరుతి గది అనేది ఆ స్థానంలో అంటే.. ఆ ఆఫీస్ మొత్తం స్థలంలో నైరుతి స్థానాన్ని చాలా జాగ్రత్తగా లెక్కకట్టి విభజించాలి. దక్షిణం కూడా ఆక్రమించి, దానిని నైరుతి గది అనుకోవద్దు. నైరుతి గదిలో ఒక్కరికి స్థానం చక్కగా అమరుతుంది. దానిపక్కన అటు దక్షిణం కానీ, పడమర కానీ.. మరొక చాంబర్ పెట్టుకుంటే మంచిది. తద్వారా ఎవరి శక్తీ సన్నగిల్లదు. ఇద్దరం కూర్చోవాలి. ఇద్దరికీ పెద్ద టేబుల్స్ ఉండాలి అని.. ఆ చాంబర్‌ను పెద్దగా చేసుకుంటున్నారు. అది సరైన విధానం కాదు. గోడలు దూరంగా జరిగినప్పుడు అది పేరుకే నైరుతి గది అవుతుంది కానీ, మొత్తం స్థానంలో దక్షిణం ఎగిరిపోతుంది. గమనించండి. అందుకే.. గణించి, విభజించి కూర్చోవాలి. లెక్కకట్టి కట్టిన సరైన నైరుతిలో.. ఇద్దరైనా కూర్చోవచ్చు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143