చండీగఢ్: రెజ్లింగ్ బరిలోకి సివంగిలా దూకిన మహిళ, ఇద్దరు మహిళా రెజ్లర్లకు పంచులిచ్చి హంగామా చేసింది. తనతో తలపడేవారు ఉన్నారా అంటూ ఆడియన్స్‌కు సవాల్ విసురుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) వరల్డ్ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ ఖలీ, పంజాబ్‌లో కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (CWE) పేరుతో రెజ్లింగ్ ప్రమోషన్, ట్రైనింగ్ అకాడమీని నిర్వహిస్తున్నాడు. ఈ CWE మ్యాచ్‌లు కూడా కొంత నాటకీయంగా, వినోదభరితంగా ఉంటాయి. ఇలాంటి పలు ఫన్నీ మ్యాచ్‌ల వీడియోలను ఖలీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
ఖలీ అకాడమీలోని రెజ్లింగ్ రింగ్‌లో ఇద్దరు మహిళా రెజ్లర్ల మధ్య పోటీ జరుగుతుంది. ఇంతలో ఉన్నట్టుంటి ఒక యువతి ప్రేక్షకులను నెట్టుకుని బాక్సింగ్ బరిలోకి దిగుతుంది. ఏం చేస్తున్నావు అని ఇద్దరు రిఫరీలు అడిగినా ఆమె పట్టించుకోదు. తొలుత బ్లూడ్రెస్ వేసుకున్న మహిళ ముఖంపై పంచులిస్తుంది. అనంతరం రెడ్ డ్రెస్ ధరించిన మహిళను నాకౌట్ చేస్తుంది. మళ్లీ ఎదుర్కొనేందుకు వచ్చిన బ్లూ డ్రెస్ మహిళకు పంచులిచ్చి నాకౌట్ చేస్తుంది.
ఇక రెండో క్లిప్‌లో ఆ మహిళను ప్రశ్నించిన ఒక రిఫరీ ప్రైవేట్ భాగంలో కిక్క్ ఇస్తుంది. దీంతో బాధతో విలవిల లాడిన ఆ వ్యక్తి రెజ్లింగ్ వేదిక నుంచి వెళ్లిపోతాడు. ఇది చూసిన రెండో రిఫరీ కూడా మెల్లగా అక్కడి నుంచి జారుకుంటాడు. తర్వాత సీన్లో ఇద్దరు మహిళా రెజ్లర్లు, రిఫరీలు రెజ్లింగ్ వేదిక కింద పడి బాధతో మెలికలు తిరుగుతుంటారు. అనంతరం ఆ యువతి ఆడియన్స్‌కు చాలెంజ్ చేస్తుంది. తనతో తలపడాలనునేవారు రెజ్లింగ్ వేదికపైకి రావాలని సవాల్ విసురుతుంది. అయితే ఇది అక్రమం అని ఆడియన్స్‌లోని కొందరు రిఫరీలు అరుస్తారు. మహిళల ఫైట్‌ను అడ్డుకోవడంపై ఒక వ్యక్తి మండిపడతాడు.
ఇంతలో బక్కగా ఉన్న ఒక వ్యక్తి ధైర్యం చేసి రెజ్లింగ్ వేదికపై వెళ్తాడు. ఆ మహిళను ఎత్తుకుని వేదిక నుంచి కిందకు దించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆమె రెజ్లింగ్ వేదిక రోప్స్‌ను గట్టిగా పట్టుకుంటుంది. రింగ్‌ను వదిలి వెళ్లేందుకు నిరాకరిస్తుంది. దీంతో ఈ మూడో వీడియో క్లిప్ ముగుస్తుంది. కాగా, ఫన్నీగా ఉన్న ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.