గువాహటి: అసోంలో ఏనుగుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా విద్యుత్ షాక్, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విషాహారం తినడం, గోతుల్లో పడిపోవడం, పిడుగుపాట్లకు గురికావడం లాంటి కారణాలతో ఏనుగులు కూడా భారీ సంఖ్యలో మరణిస్తున్నాయి. అయితే, తరచూ ఏనుగుల దాడులు జరుగుతుండటంతో అటవీ ప్రాంతాల సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ధుబ్రి జిల్లా తమర్హట్ ఏరియాలోని ఓ గ్రామంలో వ్యక్తిపై ఏనుగు దాడిచేసింది.
తమర్హట్ ఏరియాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తులు తమ టీ తోటల్లో పనులు చేసుకుంటుండగా సమీప అడవి నుంచి దారి తప్పి ఒక ఏనుగు అటువైపు వచ్చింది. దాంతో ఏనుగును చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. అది గమినంచిన ఏనుగు వారిని వెంబడించింది. ఈ క్రమంలో కనకరాయ్ అనే వ్యక్తి కాలుజారి పడిపోయాడు. దాంతో అతనివద్దకు చేరుకున్న ఏనుగు కనకరాయ్పై దాడిచేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కనకరాయ్ ప్రస్తుతం ఆస్పత్రిలోమృత్యువుతో పోరాడుతున్నాడు.
#WATCH | A 30-year-old man was chased and attacked by a wild elephant at a village in Tamarhat area of Dhubri district of Assam on December 18
— ANI (@ANI) December 20, 2021
"The man was admitted to a hospital for treatment and the elephant was chased towards jungle area," a forest officer said pic.twitter.com/YsRvZAUe1h
కాగా, దేశంలో అత్యధికంగా ఏనుగుల జనాభా ఉన్న రెండో రాష్ట్రం అసోం. అందుకే అక్కడ తరచూ అడవుల సమీప గ్రామాలపై ఏనుగుల దాడులు చోటుచేసుకుంటున్నాయి. దాడుల తీవ్రత ఎంతలా ఉందంటే ఈ ఏడాది ఇప్పటివరకే ఏనుగుల దాడుల్లో 61 మంది అస్సామీలు మరణించారు. అదేవిధంగా వివిధ ప్రమాదాలు, విపత్తుల్లో ఏనుగులు కూడా భారీగానే మరణిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 71 ఏనుగులు మృతిచెందాయి. ఇక గత పదేండ్ల లెక్కచూస్తే మొత్తం 812 మంది ఏనుగుల దాడుల్లో చనిపోయారు. 900 ఏనుగులు వివిధ కారణాలతో మరణించాయి.