రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నగరాలు నాశనమైపోతున్నాయి. చాలామంది పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. పుట్టెడు దుఃఖంతో శరణార్థులుగా వేరేచోటికి వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల వద్ద పిల్లాజెల్ల, మూటాముల్లెతో క్యూకడుతున్నారు. అందమైన, సుసంపన్నమైన ఉక్రెయిన్ ఇప్పుడు బూడిదలా మారిపోయింది. ఇంతటి విషాద సమయంలోనూ ఓ వీడియో అందరి మొహాలపై చిరునవ్వులు పూయించింది. శరణార్థి పిల్లలతో ఇద్దరు స్లొవాక్ పోలీసులు సరదాగా ఆడుకుంటున్న వీడియో అందరినీ ఆకట్టుకున్నది.
స్లొవాక్ రిపబ్లిక్ పోలీసు అధికారిక ఫేస్బుక్ పేజీలో ఈ వీడియో పెట్టారు. ఇందులో ఇద్దరు స్లొవాక్ పోలీసులు ఉక్రెయిన్ శరణార్థి పిల్లలను ఎత్తుకుని అటూఇటూ పరుగెత్తుతూ నవ్వుతుంటారు. ఆ పిల్లలను ఆడిస్తారు. పిల్లలతోపాటు పోలీసు అధికారులు ముసిముసి నవ్వులు రువ్వుతూ మురిసిపోతుంటారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. విషాదంలో కాస్త ఆనందాన్ని పంచింది.