కలల కొలువు సాధించాలి, నచ్చిన ప్లేస్‌కి టూర్ వెళ్లాలి, ఫేవరెట్ యాక్టర్‌తో ఫొటో దిగాలి… జీవితంలో ఇలాంటి కోరికలు చాలామందికి ఉంటాయి. అయితే, కొందరికీ మాత్రం అవి తీరని కోరికలుగా మిగిలిపోతాయి. అలాంటివాళ్లకు తమ కల నిజమయ్యే రోజు రావాలనేగానీ పట్టలేనంత సంతోషం వేస్తుంది. అచ్చం అలాంటి సంఘటనే ఈ పెద్దాయన జీవితంలో జరిగింది. అర్జెంటీనాకు చెందిన ఈయన బాకా జూనియర్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కి పెద్ద ఫ్యాన్. టీవీల్లో ఆ క్లబ్ మ్యాచ్ చూసి మురిసిపోయేవాడు. అయితే, ఒక్కసారైనా స్టేడియంకి వెళ్లి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలనేది ఈయన కోరిక. కానీ, ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు. దాంతో, తన కోరిక ఎప్పటికీ తీరదేమోననే బెంగ ఉండేది ఆయనకు. ఈ విషయం తెలిసి, తాత కలని నిజం చేయాలనుకున్నాడు మనవడు నానో రోడ్రిజ్.
జీవితంలో ముఖ్యమైన క్షణం
తాతని మొదటిసారి ఫుట్‌బాల్ స్టేడియానికి తీసెకెళ్లిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు నానో. అందులో తన తాతతో ‘మీరు మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నారు’ అని చెప్తాడు నానో. దాంతో వాళ్ల తాత ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటాడు. తన ఫేవరెట్ టీం జెర్సీ వేసుకొని మ్యాచ్ చూసేందుకు వెళ్తాడు. స్టేడియంలోకి వెళ్లాక ఉత్సాహంతో విజయ సంకేతం చూపిస్తాడు. తన కలని నిజం చేసిన మనవడిని గట్టిగా హత్తుకుంటాడాయన. తాతతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్న వీడియోకి ‘నేను ఇక్కడ నా జీవితంలోని ముఖ్యమైన క్షణాల్ని పోస్ట్ చేస్తున్నాను. ఈ క్షణాల్ని ఎప్పటికీ నా గుండెల్లో పెట్టుకుంటాను’ అని స్పానిష్ భాషలో క్యాప్షన్ రాశాడు నానో. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసినోళ్లంతా తాత మనవడి అనుబంధాన్నిమెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.