ధనవంతుల క్లబ్బులో చేరిన ఒక కోటీశ్వరుడు కార్డ్ గేమ్ ఆడుతూ ఏకంగా రూ.39 కోట్ల వరకూ పోగొట్టుకున్నాడు. వాటిని అతను కట్టడం లేదని సదరు క్లబ్బు కేసు కూడా వేసింది. ఆ కేసులో అతన్నే తప్పుబట్టిన కోర్టు.. డబ్బులు చెల్లించాలని తీర్పిచ్చింది. ఇప్పుడు ఆ కోటీశ్వరుడు సదరు క్లబ్బుపై కేసు వేశాడు.
వరుస పెట్టి ఓడిపోతున్న తనను క్లబ్బు నిర్వాహకులు ఆపకుండా, మరింత అప్పు ఇచ్చి మరీ జూదం ఆడించారంటూ అతను ఆరోపించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలేషియాకు చెందిన హాన్ జో లిమ్ అనే ఒక టైకూన్.. లండన్‌లోని అస్పినాల్స్ క్లబ్బులో చేరాడు. ఇక్కడ కూడా హాన్ జో లిమ్‌కు ఆస్తులున్నాయి.
ఈ క్రమంలోనే ప్రైవేటు మెంబర్స్ క్లబ్బులో చేరిన అతను 2015లో బాకరాట్ అనే గేమ్ ఆడాడు. దీనిలో వరుస పెట్టి ఓడిపోతున్న అతనికి క్లబ్బు మరింత అప్పు ఇచ్చింది. అతని కార్డు లిమిట్ 6 లక్షల యూరోలైతే, ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఈ లిమిట్‌ను 19 లక్షల యూరోలకు ఆ క్లబ్బు పెంచింది.
అక్కడితో ఆగకుండా మరో 20 లక్షల యూరోలు అప్పు ఇచ్చింది. ఈ మొత్తం డబ్బును హాన్ జో పోగొట్టుకున్నాడు. అతను డబ్బు కట్టడం లేదని అస్పినాల్స్ క్లబ్బు కేసు వేసి గెలిచింది. ఇప్పుడు 2005 గ్యాంబ్లింగ్ చట్టంలోని ఒక అంశాన్ని చూపిన హాన్ జో తనే కేసు వేశాడు.
బలహీనంగా ఉన్న మెంబర్లకు రక్షణ కల్పించాలని ఆ నిబంధన చెప్తోంది. ఈ రక్షణ కల్పించడంలో అస్పినాల్స్ క్లబ్బు విఫలమైందని హాన్ జో ఆరోపించాడు.