లక్నో: హార్డ్‌వేర్ షాపులో చోరీ చేసిన తర్వాత ఒక దొంగ ఆనందం పట్టలేక డ్యాన్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో శుక్రవారం అర్థ రాత్రి ఈ చోరీ జరిగింది. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) నివాసం సమీపంలోని ఒక హార్డ్‌వేర్ షాపు షట్టర్‌ను దొంగ పగులగొట్టాడు. అందులోకి చొరబడి కొన్ని వస్తువులతోపాటు కొంత నగదు చోరీ చేశాడు. ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న ఆ దొంగ అనంతరం ఆ షాపులో డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. పగులగొట్టిన షట్టర్ కింద నుంచి బయటకు వెళ్లిపోయాడు.
కాగా, మరునాడు హార్డ్‌వేర్ షాపునకు వచ్చిన యజమాని షట్టర్ పగులగొట్టి ఉండటం చూసి ఆందోళన చెందాడు. లోనికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గ్రహించాడు. దీంతో షాపులో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాడు. దీని ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లో షాపు ఓనర్ ఫిర్యాదు చేశాడు. కొన్ని వస్తువులతోపాటు రూ.6,000 నగదును దొంగ చోరీ చేసినట్లు అందులో పేర్కొన్నాడు.
మరోవైపు సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ను మనోజ్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. చందోలీ పోలీసులతోపాటు లక్నో జోన్ ఏడీజీకి ట్యాగ్ చేశాడు. ఈ దొంగ చోరీ తర్వాత సెలబ్రేట్ చేసుకున్నాడు. చందోలీ పోలీసులు దీనికి బాధ్యత వహిస్తారా? అని అందులో ప్రశ్నించాడు. దీంతో కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు బదులిచ్చారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी में अब चोर चोरी के बाद जश्न मना रहा है चंदौली में @chandaulipolice आपकी कोई ज़िम्मेदारी है क्या ? @adgzonelucknow pic.twitter.com/RTnNJdScEa
— Manoj KAKA (@ManojSinghKAKA) April 18, 2022