మీరు ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు వివిధ రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. కొందరు ఏదో తింటుంటారు.. మరికొందరు షాపింగ్ చేస్తుంటారు.. ఇంకొందరు హడావిడిగా ఫ్లైట్ ఎక్కేందుకు వెళ్తుంటారు. కొందరు కుర్చీల్లో సేదతీరుతుంటారు. కానీ, ఎయిర్‌పోర్ట్‌లోనే జీవించేవారిని మీరెప్పుడైనా చూశారా?
అయితే, మీరు చైనాకు చెందిన వీ జియాంగ్వో గురించి తెలుసుకోవాల్సిందే. బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అతడు 14 ఏళ్లుగా జీవిస్తున్నాడు. భార్యమీద కోపంతో ఇల్లు వదిలి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. 2008లో అతడు తన భార్యతో గొడవపడ్డాడు. అప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. బీజింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, టర్మినల్ 2లో ఉంటున్నాడు.
వీ జియాంగ్వోకు ఉద్యోగం లేదు. అతడిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వెయ్యి యువాన్ల అలవెన్స్ వస్తుంది. వాటితోనే జీవనం సాగిస్తున్నాడు. ఎయిర్‌పోర్టులోనే పగలు, రాత్రి ఉంటున్నాడు. చిన్న ఎలక్ట్రిక్ స్టవ్‌పై వంట చేసుకుంటాడు. ఒక్కోసారి అక్కడే ఉన్న దుకాణాల్లో ఇష్టం వచ్చింది కొనుక్కొని తింటాడు. మద్యం, సిగరెట్ తాగుతాడు.
తను ఇక ఎన్నటికీ ఇంటికీ వెళ్లబోనని వీ జియాంగ్వో చైనా డెయిలీతో తెలిపాడు. అక్కడ తనకు స్వేచ్ఛలేదని వాపోయాడు. ఇంట్లో సిగరెట్లు, మద్యం మానేయాలని భార్య గొడవపెడుతున్నదని చెప్పుకొచ్చాడు. ఒకవేళ మానేయకుంటే తనకు వచ్చే అలవెన్స్ ఇచ్చేయాలని పట్టుబట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి, ఇక్కడే జీవనం సాగిస్తున్నానని తెలిపాడు.