చాలారోజులు పనిచేసిన సంస్థతో మనకు అనుబంధం ఏర్పడుతుంది. వేరే ఉద్యోగం మారాల్సి వచ్చినప్పుడు వెళ్లాలనిపించదు. కానీ, వెళ్లక తప్పదు. ఇలాంటి అనుభవమే ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ సురభినాయర్కు ఎదురైంది. ఆమె వేరే ఉద్యోగానికి మారాల్సి వచ్చింది. అయితే, చివరగా ఆమె ఇండిగో ఫ్లైట్‌లో మాట్లాడిన మాటలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను రేడియో జాకీ అమృత సురేశ్ షేర్ చేశారు. సురభి నాయర్ ఎగురుతున్న ఇండిగో ఫ్లైట్‌లోని పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉపయోగించి, తన చివరి సందేశాన్ని అందించారు. ‘ఈ రోజు వస్తుందని నేను అనుకోలేదు. నా హృదయం ముక్కలవుతోంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇది చాలా మంచి కంపెనీ. ప్రతి ఒక్క ఉద్యోగిని మంచిగా చూసుకున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాకు ఈ కంపెనీ విడిచి వెళ్లాలని లేదు..కానీ, వెళ్లక తప్పదు.’ అని భావోద్వేగపూరితంగా చెప్పింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 3.2 లక్షల వ్యూస్ వచ్చాయి.