ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు జపాన్‌కు చెందిన కేన్ తనకా (118) ఏప్రిల్ 19న కన్నుమూశారు. ఆమె మరణంతో 118 ఏళ్ల ఫ్రెంచ్ సన్యాసిని ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు.
సిస్టర్ ఆండ్రే అని పిలుస్తున్న లూసిల్ రాండన్ ఫిబ్రవరి 11, 1904న జన్మించారు. ఆమె ఫ్రాన్స్‌లో నివసిస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా 118 ఏళ్ల వయస్సులో జీవించి ఉన్న వృద్ధురాలిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకెక్కారు. ఈ ఘనత సాధించేకంటే ముందు ఆమె అత్యంత పెద్ద వయస్సుగల మూడో ఫ్రెంచ్ వ్యక్తి, మూడో యూరోపియన్ వ్యక్తి కూడా. అలాగే, కొవిడ్‌సోకి బతికి బట్టకట్టిన అత్యంత వయస్సుగల వృద్ధురాలు. అత్యంత ఎక్కువకాలం జీవించి ఉన్న సన్యాసినిగా ఆమె రికార్డులు కలిగి ఉన్నారు.
ఆమె సుదీర్ఘ సేవా జీవితంలో ఉపాధ్యాయురాలిగా, గవర్నెస్‌గా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధసమయంలో పిల్లల సంరక్షకురాలిగా వ్యవహరించారు. ఆమె విచీ, అవెర్గ్నేరోన్ ఆల్ప్స్ ప్రాంతంలోని దవాఖానలో 28 ఏళ్లు అనాథలు, వృద్ధుల బాగోగులు చూసుకున్నారు. రెండు ప్రపంచ యుద్ధాలతోపాటు స్పానిష్ ఫ్లూ, కొవిడ్-19 మహమ్మారిలను చూశారు.
అయితే, లూసిల్ రాండన్ సుదీర్ఘ జీవిత రహస్యం ఏమిటి? అని ఇప్పుడు అంతా సెర్చ్ చేస్తున్నారు. ఆమె గురించి సంరక్షకులు కొంత సమాచారాన్ని పంచుకున్నారు. రాండన్ ప్రతిరోజూ అల్పాహారం తప్పనిసరిగా తీసుకుంటారు. ఏ రోజుకూడా బ్రేక్‌ఫాస్ట్ మిస్ అవ్వరు. అలాగే, ప్రతిరోజూ ఒక గ్లాసు వైన్ తీసుకుంటారు. బహుశా ఆమె దీర్ఘాయువు రహస్యం ఇదే అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆమె ప్రతిరోజూ చాక్లెట్స్ తప్పనిసరిగా తింటారు. ఉదయం ఏడు గంటలకు నిద్రలేస్తారు. వేళప్రకారం భోజనం చేస్తారు. సేవాభావం వల్ల ఆమె మానసిక దృఢత్వం సాధించారని, అదికూడా దీర్ఘాయువుకు ఒక కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ‘తాను రోజూ వైన్ తాగడం వల్లే ఇన్నిరోజులు బతికి ఉన్నానేమో నాకు తెలియదు.. అలా అని అందరినీ నేను వైన్ తాగమని సూచించను’ అని సిస్టర్ ఆండ్రీ పేర్కొన్నారు.