వాషింగ్టన్: సముద్ర బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న సందర్శకుల వెంటపడిన సముద్ర సింహాలు వారిని అక్కడి నుంచి తరిమాయి. అమెరికాలోని శాన్ డియాగోలో ఈ సంఘటన జరిగింది. లా జోల్లా ప్రాంతంలోని బీచ్ వారాంతంలో సందర్శకులతో కిటకిటలాడింది. కొందరు సముద్రంలో జలకాలాడుతూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేయగా, మరికొందరు బీచ్‌లోని ఇసుకలో సేద తీరారు. కాగా, ఆ బీచ్ తీరంలో రెండు సముద్ర సింహాలు నిద్ర పోతున్నాయి. ఒక మహిళ ఫొటోలు తీసేందుకు వాటికి మరింత దగ్గరగా వెళ్లింది. దీంతో మేల్కొన్న ఆ సముద్ర సింహాలు ఆ మహిళతోపాటు బీచ్‌లో ఉన్న సందర్శకుల వెంటపడి తరిమాయి. బెదిరిపోయిన బీచ్‌లోని వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
మరోవైపు బీచ్ వద్ద ఉన్న రక్షకులు వెంటనే స్పందించారు. సముద్ర సింహాల బారినపడి ఎవరూ గాయపడకుండా చూశారు. అవి తిరిగి సముద్రంలోకి వెళ్లేలా చేశారు. కాగా, ఆ సమయంలో అక్కడ ఉన్న పర్యాటకురాలు చార్లియన్నే యేనా తన మొబైల్ ఫోన్లో ఈ వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. అయితే సముద్ర సింహాలు వెంబడిస్తుండగా టూరిస్టులు భయంతో పరుగులు తీస్తుండటాన్ని చూడటం తనకు వింతగా అనిపించిందని, అందుకే వీడియోను రికార్డు చేసినట్లు స్థానిక మీడియా సంస్థకు ఆమె వెల్లడించింది.
The sea lions at La Jolla Cove San Diego have had enough of the tourists. 😂 pic.twitter.com/N1UgY4Ez78
— Anthea (@Anthea06274890) July 10, 2022