న్యూఢిల్లీ: ఒక రైలు సాంకేతిక సమస్యతో నది మధ్యలో వంతెనపై నిలిచిపోయింది. దీంతో లోకో పైలట్ పెద్ద సాహసం చేసి సాంకేతిక సమస్యను చక్కదిద్దారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆయనపై ప్రశంసలు కురిపించింది. రైలు బోగిలో ఎయిర్ లీకేజీ సమస్య వల్ల ఒక రైలు నదిపై ఉన్న బ్రిడ్జీపై ఆగిపోయింది. ఆ సమస్యను సరి చేస్తేనే ఆ రైలు ముందుకు కదులుతుంది. అయితే నది మధ్యలో ఉన్న వంతెనపై రైలు ఆగి ఉండటంతో ఆ బోగి కిందకు వెళ్లి ఎయిర్ లీకేజ్‌ను సరిచేయడం పెద్ద సవాల్‌గా మారింది.
చేసేదేమీ లేక అసిస్టెంట్ లోకో పైలట్ గణేష్ ఘోష్ పెద్ద సాహసం చేశారు. రైలు ఇంజిన్ నుంచి అతి కష్టం మీద ఎయిర్ లీకేజీ ఉన్న బోగి వద్దకు చేరుకున్నారు. అనంతరం వంతెనపై ఉన్న ఇనుప ప్లేటుపై పాకుతూ బోగి కిందకు చేరుకున్నారు. ఆయన ఏ మాత్రం పట్టు తప్పినా వంతెన పై నుంచి కింద ఉన్న నదిలోని నీటిలో పడే ప్రమాదముంది. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా రైలు బోగి కిందకు వెళ్లిన ఆయన ఎయిర్ లీకేజీని అరికట్టారు. దీంతో ఆ రైలు ముందుకు కదిలింది.
కాగా, రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికార ట్విట్టర్ ఖాతాలో సోమవారం ఒక పోస్ట్ చేసింది. ‘ప్రయాణీకుల సేవ, భద్రతకు అంకితం. ప్రయాణికులకు 24 గంటలు సేవలందించేందుకు రైల్వే సేవకులు కట్టుబడి ఉన్నారు’ అని పేర్కొంది. అసిస్టెంట్ లోకో పైలట్ గణేష్ ఘోష్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి వంతెనపై ఆగిన రైలు బోగి కిందకు వెళ్లి ఎయిర్ లీకేజీ సమస్యను సరిచేసి ప్రయాణం కొనసాగేందుకు సహకరించారని తెలిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది వెల్లడించలేదు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో లోకో పైలట్ గణేష్ ఘోష్ ధైర్య సాహసాలను నెటిజన్లు కూడా ప్రశంసించారు.
यात्रियों की सेवा और सुरक्षा में समर्पित।
Railsevaks are committed to serve its passengers 24×7. An exemplary display of courage by Ganesh Ghosh, ALP who crawled under the coaches of halted train on a bridge & rectified air leakage issue that helped resume the journey. pic.twitter.com/9ZdkXBYacY
— Ministry of Railways (@RailMinIndia) June 20, 2022