ఇస్లామాబాద్ : పెండ్లి వేడుకలో అందంగా కనిపించాలని కోరుకోని వధువు ఉండదు. పెండ్లి దుస్తుల్లో మెరిసిపోవాలని, ఆకట్టుకునేలా ముస్తాబవుతుంటారు. పాకిస్తానీ వధువు అలాగే ఆలోచించి బరువైన లెహంగాను ఎంచుకుంది. వంద కిలోల బరువున్న లెహంగాతో ఆపసోపాలు పడింది. పెండ్లికొడుకు పక్కన కూర్చున్న వధువు లెహంగా స్టెయిర్స్ ను దాటి పరుచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వేడుకకు హాజరైన మహిళలంతా లెహంగా బరువు గురించే ముచ్చటించుకున్నారు. మరోవైపు పెండ్లికొడుకు గోల్డెన్ షేర్వాణి, మెరూన్ తలపాగాతో సింపుల్‌గా తయారయ్యాడు. ఇది ఏడాది కిందటి వీడియో అయినా తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తలోరకంగా స్పందించారు.
లెహంగాకు ఎక్కువ ఖర్చు చేసి ఉంటారని కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఆమె డ్రెస్ బాగుందని మెచ్చుకున్నారు. లెహంగాను ఆమె ధరించిందా లేక లెహంగానే ఆమెను ధరించిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మరికొందరు యూజర్లు. అతిధులకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలకడానికి బదులు రెడ్ లెహంగా వెల్కం ఇచ్చారా అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.