న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మహిళకు సహాయం చేశాడు. అయితే అనంతరం అతడు కింద పడ్డాడు. ఒక ఆఫీస్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి కార్యాలయంలో కంప్యూటర్ వద్ద కూర్చొని పని చేస్తున్నాడు. ఇంతలో ఒక మహిళ ఆ గది నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన సమీపానికి వస్తుంది. అయితే అక్కడి డోర్ మూసి ఉంది. మరోవైపు ఆ మహిళ చేతిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. గమనించిన ఆ వ్యక్తి తన కుర్చీ నుంచి పైకి లేచి తలుపు తీశాడు. ఆమె బయటకు వెళ్లేందుకు సహకరించాడు. కాగా, చైర్ నుంచి పైకి లేచే క్రమంలో ఆ వ్యక్తి దానిని వెనక్కి తోశాడు. ఇది గమనించకుండా తిరిగి కూర్చొనేందుకు ప్రయత్నించాడు. అక్కడ కుర్చీ లేకపోవడంతో కిందపడ్డాడు. ఆ షాక్ నుంచి తేరుకోలేక కొంతసేపు అలాగే ఉండిపోయాడు.
మరోవైపు ఆ ఆఫీస్‌లోని సీసీటీవీలో ఇది రికార్డైంది. పంజాబ్ ఇండస్ట్రీ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డోర్ తీసి మహిళకు సహాయం చేసిన వ్యక్తి అనంతరం కుర్చీలో కూర్చొబోయి కిందపడటం చూసి పలువురు నెటిజన్లు నవ్వుకున్నారు. లాఫింగ్ ఇమోజీలతో పలు కామెంట్లు చేశారు.