Father Promotion | అంకిత్ జోషి.. ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరాడు. ఆరంకెల జీతంతో హాయిగా ఉన్నాడు. ఇంతలో అంకిత్‌కు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. అంతే తన ముద్దుల కూతురుతో గడిపేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంకిత్‌ను అభినందిస్తూ పెద్ద సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి. కూతురు స్పితిని ముద్దాడుతున్న ఫొటోను హ్యూమన్స్ ఆఫ్ బొంబే ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్చేయగా.. చాలా తక్కువ టైంలో 1.46 లక్షల లైక్స్ సంపాదించింది.
అంకిత్ జోషి తాను పనిచేస్తున్న కంపెనీకి సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా కొన్ని నెలల క్రితమే కొత్త జీవితం ప్రారంభించాడు. ఇదే సమయంలో ఆయన భార్య ఆకాంక్ష పండంటి పాపకు జన్మనిచ్చింది. దాంతో తన ముద్దుల తనయతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయం తీసుకున్నాడు. కొత్త ఉద్యోగ బాధ్యతల్లో తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుండటంతో తన ఆరంకెల జీతం ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. ఈయన విచిత్రమైన నిర్ణయానికి భార్య ఆకాంక్ష కూడా మద్దతు తెలిపింది.
‘తన కుమార్తె స్పితి జన్మించిన తర్వాత ఎక్కువ విరామం కావాలని కోరుకున్నా. అందుకు నా సెలవును పొడగించా. మళ్లీ పొడగించలేరని తెలుసు. అందుకే తండ్రిగా పొందిన ప్రమోషన్‌తో ఆనందించేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశా..’ అని హ్యూమన్స్ ఆఫ్ బొంబేకు అంకిత్ జోషి వెల్లడించాడు. ‘స్పితి పుట్టినప్పటి నుంచి తన జీవితం అంతా ఆమెకే కేటాయిస్తూ ఈ మధుర క్షణాలను ఎంతగానో ఆనందిస్తున్నాను..’ అని చెప్తున్నాడు జోషి. నిజమే..! మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు ఎంత ముఖ్యమైనదో.. మగ ఉద్యోగులకు పితృత్వ సెలవు కూడా అంతే ముఖ్యమైనది అని హ్యూమన్స్ ఆఫ్ బొంబే వ్యాఖ్యానించింది.