Shalini Chouhan : దొంగల్ని, నేరస్థులను పట్టుకునేందుకు కొన్నిసార్లు వివిధ గెటప్‌లు వేస్తుంటారు. మఫ్టీలో మాటు వేసి మరీ పట్టుకుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఒక మహిళా పోలీస్ అచ్చం అలానే చేసింది. షాలినిచౌహన్ అనే పోలీస్ ఇండోర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కేసు అనుమానితులను పట్టుకునేందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టింది. అందుకోసం ఏకంగా కాలేజీ స్టూడెంట్‌గా మారింది. బీకామ్ చదివిన ఆమె నర్సుగా కాలేజీలో ఎంటర్ అయింది. సీక్రెట్ ఆపరేషన్ ద్వారా 11 మంది సీనియర్ విద్యార్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వాళ్లపై సీఆర్పీఎఫ్ 41ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దాంతో, చాలామంది షాలినిని అభినందిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇండోర్‌లోని సన్యోగితగంజ్ స్టేషన్లో షాలిని చౌహన్ ఈమధ్యే పోలీస్‌గా జాయిన్ అయింది. అధికారులు ఆమెకు ఎంజీఎం ర్యాగింగ్ కేసు అప్పగించారు. ఈ ఏడాది జూలైలో ఫస్టియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేధించారు. వాట్సాప్ ద్వారా మొదటి సంవత్సరం విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, ఆ కేసుని ఛేదించేందుకు షాలిని మొదటి సంవత్సరం విద్యార్థిగా కాలేజీలో చేరింది. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఫ్రెండ్స్ చేసుకుంది. షాలిని పోలీస్ అని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆమె కాలేజీ క్యాంటీన్, క్యాంపస్‌లో రోజుకు 6 గంటలు ఉంటూ ర్యాగింగ్‌కు పాల్పడే వాళ్లను గమనించేది. జూనియర్లను వేధిస్తున్న 11 మంది సీనియర్లను షాలిని పట్టుకుంది. ఆమె తండ్రిని పోలీస్‌గా పనిచేసేవాడు. అయితే, ఆయన 2010లో చనిపోయాడు. దాంతో, తను కూడా పోలీస్ అవ్వాలనుకుంది. ఖాకీ చొక్కా వేసుకొని మొదటి కేసును ఛేదించి ప్రశంసలు అందుకుంది.