ఇటీవలి కాలంలో వింత కారణాలతో ఆగిపోతున్న పెళ్లిళ్ల గురించి కథలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా అలాంటిదే మరో ఘటన జరిగింది. ఔరాయా అనే ప్రాంతంలో పెళ్లి జరుగుతోంది. సంప్రదాయాల ప్రకారం ‘వరమాల’ కార్యక్రమం వరకూ పెళ్లి జరిగింది.
‘వరమాల’లో పెళ్లి కూతురు, వరుడు ఒకరి మెడలో ఒకరు పూలదండలు వేసుకోవాలి. ఈ సమయంలో వరుడు తన చేతిలోని దండను అమ్మాయి మెడలో వేయకుండా ఆమెపైకి విసిరాడని సమాచారం. ఇలా తనపైకి పూలదండ విసిరినందుకు ఆ వధువుకు కోపం వచ్చింది.
తాను ఈ పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పింది. ఎవరు ఎంత చెప్పినా ఆమె వినలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు వచ్చి విషయం తెలుసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రెండు కుటుంబాలు కలిసి ఆ వధువును బతిమాలారు.
కానీ ఆమె ఒక్క మెట్టు కూడా దిగలేదు. దీంతో పెళ్లి ఆపేయాల్సి వచ్చింది. పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న బహుమతులన్నింటినీ తీసుకొని రెండు కుటుంబాలు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.