లక్నో: సాధారణంగా యూనివర్సిటీలు ఉన్నత ప్రామాణాలతో కూడిన విద్యను అందించడంపై దృష్టిసారిస్తుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక యూనివర్సిటీ దీనికి భిన్నంగా వ్యవహరించింది. ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలి అన్నదానిపై క్యాంపస్‌లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి (కాశీ) లోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ఇటీవల ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. యూనివర్శిటీ సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా ఇందులో పాల్గొన్నారు. ఆవు పేడతో పిడకలు ఎలా తయారు చేయాలి అన్నదానిపై విద్యార్థులకు ఆయన శిక్షణ ఇచ్చారు.
అలాగే పిడకల ఉపయోగాలను ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా వివరించారు. వంట కోసమేగాక పూజలు, యజ్ఞ యాగాదులకు పిడకలను ఉపయోగిస్తారని చెప్పారు. అంతేగాక తమ విద్యార్థులు గ్రామాలకు వెళ్లి ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలన్నదానిపై గ్రామస్తులకు శిక్షణ ఇస్తారని ఆ డీన్ తెలిపారు. పిడకల అమ్మకాల కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
కాగా, విశ్వవిద్యాలయంలోని సమీకృత గ్రామాభివృద్ధి కేంద్రంలో ఇటీవల ఈ వర్క్‌షాప్ జరిగినట్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) తెలిపింది. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఒక డీన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని కార్యాలయంతోపాటు బీహెచ్‌యూ వీసీ కార్యాలయం, బీహెచ్‌యూ పీఆర్వోకు దీనిని ట్యాగ్ చేశారు.
మరోవైపు ఆవు పేడతో పిడకలు తయారు చేయడంపై బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు మీమ్స్, జోకులతో స్పందించారు. గ్రామాల్లోని ప్రజలకు పిడకలు చేయడం తెలుసని, ఈ విద్యార్థులు శిక్షణ ఇచ్చే అవసరం లేదని ఒకరు ఎద్దేవా చేశారు. ఉన్నత విద్యను అందించాల్సిన యూనివర్సిటీలు, ఇలా పిడకల తయారీపై శిక్షణ ఇచ్చి వర్సిటీ ప్రమాణాలు, ప్రతిష్ఠను దిగజార్చవద్దని కొందరు హితవు పలికారు.
गोबर से उपला या गोहरी बनाने का हुनर सीखते छात्र @VCofficeBHU @bhupro @PMOIndia @narendramodi pic.twitter.com/My2nYPW9Km
— संकाय प्रमुख,सामाजिक विज्ञान संकाय, BHU (@fssdean) February 4, 2022