బ్రెసిలియా: బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి బస్సు కింద పడ్డాడు. అయితే హెల్మెట్ అతడి ప్రాణాలను కాపాడింది. బ్రెజిల్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రియో డి జనీరోలోని బెల్ఫోర్డ్ రోక్సో ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల అలెక్స్ సిల్వా పెరెస్, సోమవారం బ్రెడ్ కోసం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. ఒక మలుపు వద్ద బస్సు ఎదురుగా రాగా, బైక్‌పై వెళ్తున్న అలెక్స్ నియంత్రణ కోల్పోయాడు. అతడు సడెన్ బ్రేక్ వేయడంతో బైక్ నుంచి ఎగిరి బస్సు కింద పడ్డాడు. అయితే అతడు హెల్మెట్ ధరించి ఉండటంతో బస్సు వెనకున్న టైర్ దానిని కొన్ని అడుగులు ఈడ్చింది. అనంతరం బస్సు ఆగింది.
కాగా, బస్సు టైర్ కింద హెల్మెట్ ఇరుక్కుపోవడంతో డ్రైవర్ కాస్త వెనక్కి నడిపాడు. ఇంతలో స్థానికులు వెంటనే అలెక్స్ వద్దకు వచ్చారు. బస్సు చక్రం కింద హెల్మెట్‌తో పడి ఉన్న అతడ్ని బయటకు లాగారు. అలాగే అతడి బైక్‌ను కూడా బస్సు కింద నుంచి పక్కకు తీశారు. హెల్మెట్ ధరించడంతో అలెక్స్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. స్వల్పంగా గాయపడిన అతడు పైకి లేచి తన బైక్‌పై వెళ్లిపోయాడు.
మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బెంగళూరు జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ డాక్టర్ బీఆర్ రవికాంతే గౌడ బుధవారం ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేశారు. మంచి క్వాలిటీ, ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని అందులో పేర్కొన్నారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందించారు. బస్సు కింద పడిన అలెక్స్‌ను నిజంగా అతడు ధరించిన హెల్మెట్టే కాపాడిందని పేర్కొన్నారు. అలాంటి నాణ్యమైన హెల్మెట్లు ధరిస్తే ప్రమాద సమయాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని పలువురు సూచించారు.
ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಐ ಎಸ್ ಐ ಮಾರ್ಕ್ ಹೆಲ್ಮೆಟ್" ಜೀವರಕ್ಷಕ"
Good quality ISI MARK helmet saves life. pic.twitter.com/IUMyH7wE8u
— Dr.B.R. Ravikanthe Gowda IPS (@jointcptraffic) July 20, 2022