Worlds largest Aquarium : అది ప్రపంచంలోని భారీ అక్వేరియం. 46 అడుగుల ఎత్తుతో సిలిండర్ ఆకారంలో ఉండే ఇందులో 1500కు పైగా అరుదైన చేపలు ఉన్నాయి. సందర్శకులకు వినోదాన్ని పంచిన ఆ అక్వేరియం ఉన్నట్టుండి ఒక్కసారిగా బద్ధలైంది. ఈ సంఘటన బెర్లిన్‌లో శుక్రవారం జరిగింది. అక్కడి లీజర్ కాంప్లెక్స్‌లోని డోమ్ అక్వారే ముక్కలైంది. అందులోని 10 లక్షల లీటర్ల నీళ్లు రోడ్డు మీదకు వచ్చాయి. అక్వేరియం గాజు ముక్కలు హోటల్ కాంప్లెక్స్, రోడ్డు మీద చెల్లా చెదురుగా పడ్డాయి. దాంతో వంద మంది సహాయ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ఈ భారీ అక్వేరియం ముక్కలు కావడానికి కారణం ఏంటనేది తెలియలేదు.
ఆ సమయంలో దాదాపు 350 మంది హోటల్లో ఉన్నారు. వాళ్లను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. సహాయక సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, గాజు ముక్కలు పేరుకుపోవడంతో సాధ్యం కావడంలేదని అధికారి తెలిపారు. అక్వేరియం గాజు ముక్కలు తగిలి ఇద్దరు గాడయపడ్డారని బెర్లిన్ పోలీసులు తెలిపారు. హోటల్లోని వాళ్లను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే.. ప్రస్తుతం బెర్లిన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది.
బెర్లిన్‌లోని లీజర్ కాంప్లెక్స్‌లో రాడిసన్ హోటల్, మ్యూజియం, షాపులు, రెస్టారెంట్ ఉన్నాయి. వాటన్నింటిలో డోమ్ అక్వారే స్పెషల్ అట్రాక్షన్. దీని మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో లిఫ్ట్ ఉంటుంది. సందర్శకులు లిఫ్ట్‌లో ఎక్కి అరుదైన చేపల్ని తిలకించేవాళ్లు.