హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత రెండేండ్లలో మలేరియా తగ్గుముఖం పట్టగా, డెంగ్యూ కేసులు పెరిగాయి. గత ఏడాది మలేరియా కేసులు 664 నమోదుకాగా, డెంగ్యూ బారిన 1,244 మంది పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియాకు 608 మంది గురికాగా, 2,509 మందికి డెంగ్యూ సోకింది. ఈ ఏడాది అత్యధికంగా కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు నమోదు కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, నాగర్కర్నూల్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. డెంగ్యూ కేసులు నమోదు కాని జిల్లాగా భూపాలపల్లి నిలిచింది.
డెంగ్యూ, కరోనా లక్షణాలు ఒకటే!
డెంగ్యూ, కరోనా లక్షణాలు ఒకేవిధంగా ఉండటం వల్ల ప్రజలు వ్యాధిని గుర్తించలేకపోతున్నారని వైద్యాధికారులు అంటున్నారు. దగ్గు, జ్వరం, గొంతునొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కరోనాతోపాటు డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవడం మంచిదని చెప్తున్నారు. పగటిపూట దోమకాటు ద్వారా డెంగ్యూ వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.