హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): దళితబంధు విషయంలో ఎన్నికల సంఘం తన పరిధిని అతిక్రమించినట్టుగా కనబడుతున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉప ఎన్నిక ముగిసిన తర్వాత నవంబర్ 4 నుంచి ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల సంఘం నిర్ణయం నేపథ్యంలో ఎవరూ చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఈసీ సృష్టించింది చాలా చిన్న ఆటంకమని, దళితబంధు నిర్విఘ్నంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. మంగళవారం యాదాద్రి పర్యటనలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దళితబంధు పథకం నిలిపివేతపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఇది సందర్భం కాకపోయినప్పటికీ, మీడియా ప్రతినిధులు అడిగినందున స్పందిస్తున్నట్టు చెప్పారు. ‘దళితబంధు ఆన్‌గోయింగ్ స్కీం, హుజూరాబాద్ నియోజకవర్గం కానీ రాష్ట్రంలోని దళితబిడ్డలకు కానీ నేను చెప్పేది ఒక్కటే. నేను ఏది చేపట్టినా విజయ తీరాలకు చేర్చిన తప్ప వెనక్కి పోలేదు. మంచీ చెడు అన్నీ విచారించే దీనిని చేపట్టాను’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘తొండ బిర్రు ఎందాక అంటే ఎనుగుల దాకా’ అనే తెలంగాణ సామెతను గుర్తుచేశారు. ‘దళితబంధును ఎన్నికల సంఘం ఎన్నిరోజులు ఆపుతది. ఈ నెల 30న పోలింగ్ అయిపోతది. నవంబర్ 2న ఫలితాలొస్తాయి. నవంబర్ 4 నుంచి దర్జాగా నేనే స్వయంగా పోయి పంపిణి చేస్తా’ అని చెప్పారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ భరోసా నింపారు.