e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home Top Slides చితికిపోతున్న కుటుంబం

చితికిపోతున్న కుటుంబం

  • కరోనాతో ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత
  • బంధాలను ఛిద్రం చేస్తున్న మహమ్మారి
  • ముందస్తు జాగ్రత్తలే మేలంటున్న నిపుణులు
చితికిపోతున్న కుటుంబం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల అర్బన్‌: కరోనా మహ్మమారితో కుటుంబాలు ‘చితి’కి పోతున్నాయి. వైరస్‌ ఒకరి తర్వాత మరొకరని కాటికి పంపుతూ కుటుంబాలను ఛిద్రం చేస్తున్నది. జగిత్యాలలో కరోనా రెండ్రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరినీ బలితీసుకున్నది. పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన అన్నదమ్ములు జంగిలి రాజన్న, జంగిలి రవీందర్‌కు పదిరోజుల క్రితం కరోనా సోకింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి రవీందర్‌ మంగళవారం మృతి చెందాడు. గురువారం రాజన్న కూడా చనిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రోజూ రెండు, మూడైనా జరుగుతూ ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కరోనా మహమ్మారి భార్యాభర్తలు, తండ్రీ కొడుకులనూ కాటేస్తున్నది. కుటుంబంలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే మిగిలినవారు సపర్యలు చేయాల్సి రావడంతో అందరికీ వైరస్‌ సోకుతున్నది. దీంతో కుటుంబంలో అందరూ కరోనా బారినపడుతూ ఒకరి తర్వాత ఒకరు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి పలు ఘటనలు రాష్ట్రంలో తరుచూ చోటుచేసుకున్నాయి.

  • జగిత్యాల గణేష్‌నగర్‌లో కిరాణా దుకాణం నిర్వహించే ఓ వ్యాపారి (64)కి పదిరోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రెండు, మూడ్రోజులలోనే అతని ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుని భార్య, ఇద్దరు పిల్లలకు వైరస్‌ సోకింది. పరిస్థితి విషమించి ఈనెల 15న పెద్దకుమారుడు (36) మృతిచెందాడు. 17న సదురు వ్యాపారిని, 20న చిన్నకుమారున్ని(34) కూడా మహమ్మారి బలితీసుకున్నది. ఇంటికి ఆధారమైన ముగ్గురి మృతితో ఇప్పుడా కుటుంబం దిక్కులేనిదైంది.
  • హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సవదాసర జగన్మోహన్‌రావు (58), అతడి భార్య బేబి (46) పదిరోజుల వ్యవధిలో మృత్యువాతపడ్డారు.
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన మారవేని కొమురవ్వ (60) ఈ నెల 26న, ఆమె భర్త దేవయ్య (65) బుధవారం కొవిడ్‌తో మృతి చెందారు. ఇదే జిల్లాలో బోయినపల్లి మండలం దుంద్రపల్లికి చెందిన గుర్రం నర్సమ్మ (65) 27న మృతిచెందగా, భర్త లింగయ్య (68)ను కరోనా బలి తీసుకున్నది.
  • కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో ఉండే నాడెం రవి, రమాదేవి కుమార్తె స్పందన (25), కుమారుడు సందీప్‌ (20) కరోనాతో మృతి చెందారు. ఈ నెల 21న సందీప్‌ మృతిచెందగా, బుధవారం స్పందన తుదిశ్వాస విడిచారు. కండ్ల ముందే పిల్లలు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.
  • పెద్దపల్లి జిల్లా టీటీఎస్‌ అంతర్గాంకు చెందిన దంపతులు మూడ్రోజుల వ్యవధిలో మృతిచెందారు. లారీల యాజమానైన భర్త నెల క్రితం బిల్లుల కోసమని మహారాష్ట్రకు వెళ్లి వచ్చాక అనారోగ్యానికి గురయ్యారు. పరీక్షల్లో అతనితోపాటు భార్యకూ పాజిటివ్‌గా తేలింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ గత శనివారం భార్య (47) , కరీంగనర్‌లోచికిత్స పొందుతూ సోమవారం భర్త (57) మృతిచెందారు.
  • నిజామాబాద్‌ జిల్లా వేల్పూరుకు చెందిన ఎలక్ట్రిషియన్‌ షేక్‌ షాదాబ్‌ (32) గతవారం కరోనా బారినపడ్డారు. పరిస్థితి విషయమించడంతో జిల్లా దవాఖానకు తరలించారు. ఈ బెంగతో షాదాబ్‌ తల్లి షేక్‌ రజియా (60) గుండెపోటుతో మరణించారు. ఆదివారం కుమారుడు షాదాబ్‌ సైతం తుదిశ్వాస విడిచారు.

అయినవారు దూరం
కుటుంబానికి అండగా ఉంటారకున్నవారు కమ్ముమూసి పుట్టెడుదుఖంలో ఉంటే, దహన సంస్కారాలకు అయినవారు రాకపోవడం బాధను రెట్టింపుచేస్తున్నది. కరోనాతో చనిపోయారని తెలిసి బంధువులెవరూ చివరి చూపునకు సైతం రావడం లేదు. కరోనా కష్టాలు కన్నీటినే మిగిలిస్తున్నాయంటూ బాధను చెప్పుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రాకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని వైద్యులు చెప్తున్నారు. లక్షణాలు ఉంటే వెంటనే ఐసొలేషన్‌ కావాలని, ఇం ట్లో వారికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్క్‌ ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం మరచిపోవొద్దని హెచ్చరిస్తున్నారు. మనం తీసుకొనే చిన్నచిన్న జాగ్రత్తలే మనతోపాటు, మన కుటుంబానికి శ్రీరామరక్ష అని పేర్కొంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చితికిపోతున్న కుటుంబం

ట్రెండింగ్‌

Advertisement