చెన్నై, ఫిబ్రవరి 10: దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, మతం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది హిజాబ్ కోసం, ఇంకొంత మంది దేవాలయాల్లో ధోవతులు మాత్రమే ధరించేలా ఆదేశాలివ్వాలని కోరడం దిగ్భ్రాంతికరంగా ఉన్నదన్నారు. ‘అసలు ఏంటి ఇదంతా? ఇది దేశమా లేకపోతే మతం పేరుతో విడిపోయిందా?’ అని ఆవేదన చెందారు.
‘దేశం ముఖ్యమా?.. మతం ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమలు చేయాలని, హిందూయేతరులు ఆలయాల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. శ్రీరంగానికి చెందిన రంగరాజన్ నరసింహన్ ఈ పిటిషన్లను దాఖలు చేశారు. హిజాబ్ వివాదం దేశాన్ని కుదిపేస్తున్న సమయంలోనే ఈ పిటిషన్లు దాఖలు కావడంపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
రెండు రిట్ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ మునీశ్వర్నాథ్ భండారీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఏ చట్టం చెప్పిందని పిటిషనర్నుప్రశ్నించింది. సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకొంటున్నారని అడిగింది. మనది లౌకిక దేశం అన్న సంగతి మర్చిపోకూడదని పిటిషనర్‌ను హెచ్చరించింది. ‘చర్చలు కేవలం హక్కులకే పరిమితం కావొద్దు. బాధ్యతల గురించి కూడా ప్రజలు మాట్లాడాలి’ అని సీజే జస్టిస్ మునీశ్వర్ నాథ్ పిటిషనర్‌కు సూచించారు.
అన్ని చోట్లా కోడ్ కోరడమేంటి?
ఏదేని ఒక ఆలయంలో నిబంధనలు ఉంటే దాని ప్రకారం అక్కడ నడుచుకోవచ్చని, కానీ.. అన్ని చోట్లా డ్రెస్ కోడ్ అమలు చేయాలని పిటిషనర్ కోరడం సమంజసం కాదని జస్టిస్ భండారీ అన్నారు. డ్రెస్ కోడ్‌పై కచ్చితమైన వివరాలు లేనప్పుడు ఆలయాల్లో నోటీసు బోర్డులపై ఏమని రాయాలని ప్రశ్నించారు. ఆగమ శాస్త్రంలో ఉన్న సమాచారాన్ని అందించాలని పిటిషనర్‌ను అడిగారు. దానికి సంబంధించిన ప్రతిని అందజేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ కోరగా, అందుకు కోర్టు సమ్మతించింది. మరోవైపు ఒక్కో దేవాలయం ఒక్కో ఆచారాన్ని అనుసరిస్తున్నదని, ఇతర మతస్థులను ధ్వజ స్తంభం వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు తమిళనాడు అడ్వొకేట్ జనరల్ ఆర్ షణ్ముగసుందరం కోర్టుకు తెలిపారు. డ్రెస్ కోడ్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.