సిద్దిపేట అర్బన్, ఆగస్టు 8: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. భారీ మెజార్టీ మీదనే దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి వారియర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ గోబెల్స్ కన్నా తీవ్ర స్థాయిలో అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. గోబెల్స్ బతికి ఉంటే బీజేపీ తీరు చూసి ఉరేసుకునేవారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ఒకేసారి అధికారంలోకి వచ్చాయని, తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిస్తే, దేశ జీడీపీ బంగ్లాదేశ్ కన్నా తక్కువగా పడిపోయేలా తయారైందని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ నాయకులు ఏం చెప్పి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు ఓట్లు అడుగుతారా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకు ఓట్లు అడుగుతారా? అని నిలదీశారు.
దళితబంధును చూసి గుండెలు బాదుకొంటున్నారు
హుజూరాబాద్‌లో ఓట్లు అడిగే ముందు రైతుబంధు, దళితబంధుపై బీజేపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. రైతుబంధును హుజూరాబాద్‌లో మొదట ప్రారంభిస్తే నాడు చప్పట్లు కొట్టిన ఈటల రాజేందర్ నేడు దళితబంధును చూసి గుండెలు బాదుకొంటున్నారని, పరిగతో పోలుస్తున్నారని ఎద్దేవాచేశారు. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని, అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. వ్యక్తి ప్రయోజనమా? హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా? అన్న చర్చ జరగాలని సూచించారు. రైతుబంధు, దళితబంధు దండుగ అంటున్న బీజేపీ నేత ఈటల కావాలా.. టీఆర్ఎస్ కావాలా అనే చర్చ పెట్టాలన్నారు. దళితబంధుపై కొద్దిమంది బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రజలకు దళితబంధు ఇవ్వొద్దా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. గత బడ్జెట్లోనే దళితుల అభ్యున్నతికి రూ.1,200 కోట్లతో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్‌ను ఆర్థికమంత్రిగా అసెంబ్లీలో ప్రకటించానని హరీశ్‌రావు గుర్తుచేశారు. దళితులు బాగుపడటం బీజేపీకి ఇష్టం లేదని మండిపడ్డారు. గడియారాలు, కుట్టుమిషన్లు, గొడుగులు, కుక్కర్లను పంచుతూ ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ప్రజలు వాటిని పగులగొట్టి, సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొంటున్నారని చెప్పారు. సోషల్ వారియర్లు నేటితరం కార్యకర్తలని, రానున్న రోజుల్లో పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కౌశిక్‌రెడ్డి, సతీశ్, దినేశ్, జగన్మోహన్రావు, వివిధ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ రూ.5వేలు ఇస్తే.. బీజేపే 2,500 తీసుకుంటున్నది
డీజిల్ ధరను రూ.60 నుంచి రూ.106కు పెంచిన బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గతేడాది వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ కిరాయి ఎకరానికి రూ.3 వేలు ఉంటే, నేడు రూ.ఐదు వేలకు పెరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ రైతుబంధు కింద ఎకరాకు ఒక్కొక్క విడతకు రూ.5 వేలు ఇస్తే, బీజేపీ ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచి రూ.2,500 తీసుకుంటున్నదని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, ఉద్యోగాలు ఊడగొడుతున్న బీజేపీ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని దుయ్యబట్టారు. బీసీ సంక్షేమశాఖ ఏర్పాటుచేయాలని కోరితే ప్రభుత్వరంగ సంస్థల అమ్మకానికి డిజిన్వెస్ట్మెంట్శాఖను ఏర్పాటుచేశారని ఎద్దేవాచేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ వంటి సంస్థలకు రూ.3 వేల కోట్లు ఇచ్చి ఉద్యోగులను కాపాడుకున్నదని గుర్తుచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలో మరో 50 నుంచి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అభయమిచ్చారు.