హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణ తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అత్యుత్తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ, పుదుచ్చేరి రాష్ర్టాల పరిస్థితులను వివరించినట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత విధానాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా వార్‌రూమ్‌ను ఏర్పాటుచేసి, హైటెక్ సాంకేతిక పరిజ్ఞానంతో దవాఖానల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన తీరును వివరించారు. తెలంగాణ అనుభవాన్నే పుదుచ్చేరిలోనూ వినియోగించుకున్నామని, ఇరురాష్ర్టాల మధ్య అవినాభావ సంబంధాన్ని పెంపొందించేందుకు ఇది ఎంతగానో దోహదపడిందని చెప్పారు. పుదుచ్చేరికి కరోనా నియంత్రణ ఔషధాలు అవసరమైనప్పుడు తెలంగాణ విశాల హృదయంతో సాయపడిందని కొనియాడారు. పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయని, హైదరాబాద్‌ను హరిత నగరంగా మార్చేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తున్నదని చెప్పారు.
ప్రధానికి పీఎం అండ్ పీఎం పుస్తకం
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా రాజ్‌భవన్‌లో పలు కార్యక్రమాలు చేపట్టామని గవర్నర్ తమిళిసై.. ప్రధాని, కేంద్రమంత్రికి తెలిపారు. యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించి, చదువుకున్న వర్సిటీలకు సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్ పరిస్థితుల్లో కేంద్రం నుంచి రాష్ర్టాలకు అన్ని విధాలుగా సహకారం అందిందని వివరించారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలపై గవర్నర్ స్వయంగా రాసిన ‘పీఎం అండ్ పీఎం’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీకి అందజేశారు. పుస్తకంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారని తమిళిసై చెప్పారు.