హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర యువత, వృత్తి నిపుణులకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కంపెనీలు పెట్టి ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇచ్చే పెట్టుబడిదారులకు సాధారణంగా ఇచ్చే రాయితీలకు అదనంగా మరికొన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. పెట్టుబడి, విద్యుత్తు చార్జీలు, ఎస్జీఎస్టీలో సబ్సిడీలు ఇవ్వడంతోపాటు స్కిల్ అప్‌గ్రెడేషన్ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.3 వేల చొప్పున అందిస్తున్నది. దీంతో పరిశ్రమలకు అదనపు మేలు జరగడమే కాకుండా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. రాష్ర్టానికి వస్తున్న భారీ పెట్టుబడిదారులతో నిర్వహించే సమావేశాల్లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్థానికులకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇటీవల వచ్చిన కిటెక్స్, మలబార్ గోల్డ్‌తోపాటు అనేక పెద్ద కంపెనీలను స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పించారు. మహేశ్వరంలో ఏర్పాటుచేసిన సోలార్ మాడ్యూల్స్ తయారీ సంస్థలో దాదాపు 80శాతానికిపైగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించారు. మహేశ్వరంలోని ఈ-సిటీలో ఉన్న పలు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇంజినీరింగ్ పరిశ్రమల్లో 80-90 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అదనపు రాయితీల వివరాలు
70 శాతం సెమీ స్కిల్డ్ మ్యాన్‌పవర్, లేక 50 శాతం స్కిల్డ్ మ్యాన్‌పవర్ స్థానికులైతే ఐదుశాతం, లేక గరిష్ఠంగా రూ. 5 లక్షలు పెట్టుబడి రాయితీ కల్పిస్తున్నారు. మధ్యతరహా పరిశ్రమలకు ఐదుశాతం, పెద్ద పరిశ్రమలకు 10 శాతం ఎస్జీఎస్టీ ఉంటుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఐదేండ్లపాటు 50 పైసలకు, పెద్ద పరిశ్రమలైతే 75 పైసలకు యూనిట్ చొప్పున విద్యుత్తు పంపిణీ చేస్తున్నారు.
80 శాతం సెమీ స్కిల్డ్, లేక 60% స్కిల్డ్ మ్యాన్‌పవర్ స్థానికులైతే సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 10 శాతం (గరిష్ఠంగా రూ.10 లక్షలు) వరకు పెట్టుబడి రాయితీ కల్పిస్తారు. ఎస్జీఎస్టీ 10 శాతం, విద్యుత్తు ప్రతి యూనిట్‌కు ఒక రూపాయికి పంపిణీచేస్తారు. స్కిల్ అప్‌గ్రెడేషన్ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.3 వేల చొప్పున ఇస్తారు.