హైదరాబాద్, మార్చి 9 (నమస్తేతెలంగాణ): ఉద్యోగోన్నతిపై పక్క జిల్లాలకు బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులకు సంబంధించి జడ్పీ జీపీఎఫ్ ట్రాన్స్ఫర్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సబ్స్క్రిప్షన్ నంబర్ కేటాయింపులో జాప్యం జరుగుతుండడంతో నగదు జమకాక అష్టకష్టాలు పడుతున్నా రు. డీఏ ఏరియర్స్ ఏ ఖాతాలో జమచేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని వా పోతున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
2023 సెప్టెంబర్‌లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు. సొంత జిల్లాల్లో ఖా ళీలు లేకపోవడంతో వందలాది మందిని పక్క జిల్లాలకు ట్రాన్స్‌ఫర్‌పై పంపించారు. వీరు జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్ నంబర్‌ను పూ ర్వపు జిల్లాల నుంచి బదిలీ చేయాలని దరఖాస్తు చేశారు. గతంలో జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్ నంబర్ ఖాతాలోని నగదు, సంబంధించిన వడ్డీని ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది.
కానీ ఏడాదిన్నర దాటినా అధికారులు వీరి సబ్స్క్రిప్షన్ నంబర్‌ను బదిలీ చేయడంలేదు. ఉపాధ్యాయ సంఘాల ద్వారా అనేకసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని హెడ్మాస్టార్లు ఆరోపిస్తున్నారు. దీంతో మూల వేతనంపై చెల్లించాల్సిన 6% సబ్స్క్రిప్షన్ నగదు చెల్లింపులు జరగడంలేదని పేర్కొంటున్నారు. డీఏ మంజూరైన సందర్భంలో వచ్చే ఏరియర్స్‌ను ఎందులో జమచేయాలో తెలియక ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా జడ్పీ జీపీఎఫ్ కష్టాలు తొలగించాలని కోరుతున్నారు.