హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖలో మతపరమైన ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా వేదపారాయణం, అర్చక, పరిచారక పోస్టుల ఎంపికలో అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు ఆ శాఖలోని పలువురు ఈవోలపై సీరియస్ అయ్యారు. ఏయే దేవాలయాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? వాటికి వచ్చిన దరఖాస్తులు ఎన్ని? వాటిపై సమగ్రంగా పరిశీలన చేయాలని దేవస్థానాల ఈవోలను ఆదేశించారు. దీంతో శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పలు దేవాలయాల ఈవోలు తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను తీసుకొచ్చి స్క్రూటినీ చేయించారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులెంతమంది? వారికి కాల్‌లెటర్లు పంపించడం తదితర అంశాలపై కసరత్తు జరిగింది.
మతపరమైన ఉద్యోగాల నియామకానికి సంబంధించిన పరీక్షలన్నీ సరస్వతీ నది అంత్యపుష్కరాల తర్వాత అంటే జూన్ 4 తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పకడ్బందీగా, నిష్పాక్షికంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని, ఈ మాత్రం ఉద్యోగాలు కూడా నింపలేకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి నియామకాలు చేపట్టలేమని కమిషనర్ జూమ్ మీటింగ్‌లో దేవాదాయ శాఖ అధికారులతో ఒకింత ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దేవాదాయ శాఖలో పనిచేసే వారికి నిజాయితీ అవసరమని, అర్చకుల దగ్గర డబ్బులు తీసుకోవడమేమిటని ఆయన మండిపడినట్టు తెలిసింది.
పరీక్షల కోసం ప్రత్యేక అధికారులు, నియామక మండలి ఉండగా దేవాదాయ శాఖ అధికారులు అభ్యర్థులకు పోస్టులు ఇప్పిస్తామంటూ ఎలా మభ్యపెడతారని ప్రశ్నించారు. శాఖలోని ఒకరిద్దరు పెద్ద అధికారుల ప్రమేయంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. పరీక్షల్లో మెరిట్ వచ్చిన వారికే పోస్టింగ్ ఇవ్వాలని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అభ్యర్థులకు కమిషనర్ హనుమంతరావు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నియామక ప్రక్రియ జరుగుతున్న ఆలయాల అధికారులు ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ అమ్మవారి దేవాలయంలో ఇటీవల చేపట్టిన నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై కూడా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆలయంలో ఒక పోస్టుకు రూ.18 లక్షలు ఒప్పందం కుదుర్చుకోగా, అందులో రూ.9 లక్షలు ఆలయ ముఖ్య అధికారి తీసుకున్నారని, ఈ తొమ్మిది లక్షలు కూడా ఆ పారాయణదారుడు తన ఇంట్లో బంగారం కుదువపెట్టి తెచ్చినట్టు దేవాదాయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఆలయంలో జరిగిన అవకతవకలపై ఏడీసీ కృష్ణవేణి విచారణ చేపట్టారు. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని ఆ ముఖ్య అధికారిపై ఆరోపణలు చేసినవారిని ఫోన్లో విచారించారు.
విచారణ సమయంలో దేవాలయంలో ఆ అధికారి ఉండగా తాము ఎలా వాంగ్మూలం చెప్పగలమని, అసలు అతను డబ్బులు తీసుకున్న విషయమే కాకుండా ఆలయంలో ఈ అర్చక, పరిచారక పోస్టుల విషయంలో చేసిన లావాదేవీల గురించి చెప్పాలంటే తమను ఎక్కడ వేధిస్తాడోననే భయం ఉన్నదని కొందరు ఆలయ ఉద్యోగులు వాపోయారు. ఈ విషయంలో కమిషనర్ చొరవ తీసుకొని ఇంటెలిజెన్స్‌తో విచారణ చేయిస్తే ఆయన బాగోతం బయటపడుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దక్షిణ తెలంగాణలో ప్రముఖ నరసింహస్వామి ఆలయంలో ఒక్కో పోస్టుకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నదనే చర్చ నడుస్తున్నది. అభ్యర్థులకు అన్ని అర్హతలున్నా కాల్‌లెటర్లు పంపకపోవడం, తాము అనుకున్న అభ్యర్థులనే పిలిచారనే ఆరోపణలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే, కొన్ని దేవాలయాల్లో తమ వారసులను అర్చకులు, పారాయణదారులు, పరిచారకులుగా నియమించుకోవడానికి ఇప్పటికే దేవాదాయ శాఖ ముఖ్య అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిసింది. ‘నమస్తే తెలంగాణ’లో కథనం వచ్చిన తర్వాత ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న వారంతా కంగుతిన్నారని, తమ పరిస్థితి ఏమిటంటూ ఆయా అధికారులను అడుగుతున్నారని తెలిసింది. కమిషనర్ సీరియస్‌గా ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లావాదేవీల వ్యవహారంలో ఆచితూచి అడుగులేద్దామని, ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఆలోచిద్దామని దేవాదాయ శాఖ ముఖ్య అధికారి ఒకరు సదరు పైరవీకారులకు చెప్పినట్టు సమాచారం.