Runa Mafi | టేకులపల్లి, ఆగస్టు 30: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రుణమాఫీ’లో ఎన్నో చిత్రవిచిత్ర గాథలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌లో అసలు అప్పునే లేదంటూ ఓ రైతుకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం తప్పించుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన సూరేపల్లి వెంకట్రావు జిల్లాకేంద్రం కొత్తగూడెంలోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఖాతా నెంబర్ 4810272000000047 పేరుతో 2021 ఫిబ్రవరిలో వ్యవసాయ రుణం తీసుకున్నాడు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుణమాఫీకి తాను అర్హుడైనప్పటికీ మాఫీ కాలేదు. దీంతో వ్యవసాయ అధికారులను సంప్రదించగా వారు ‘రైతు సమాచార పత్రం’ చేతిలో పెట్టారు. అది చూసిన రైతు నివ్వెరపోయాడు. 9-12-2023 తేదీ నాటికి తనకు బ్యాంకులో ఉన్న బకాయి జీరో లేదా నెగిటివ్‌లో ఉన్నట్లు దానిలో ఉంది. ఇదేమిటని అధికారులను అడిగితే బ్యాంక్‌లో సంప్రదించాలని ఉచిత సలహా ఇచ్చారు. చేసేదిలేక ఆ రైతు కరూర్ వైశ్యా బ్యాంక్‌కు వెళ్లి స్టేట్మెంట్ తీయించగా దానిలో 27-8-2024 తేదీ నాటికి రూ.1,63,258 అప్పు ఉన్నట్లు ఉంది. ఇదెక్కడి విచిత్రమో అర్థంకాక ఆ రైతు తల పట్టుకుంటున్నాడు. తన సమస్యను ఎవరు పరిష్కరిస్తారో తెలియక మదనపడుతున్నాడు.
నాకు కొత్తగూడెం కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ.లక్షన్నర పైన అప్పు ఉంది. మాఫీ కాలేదు. వ్యవసాయ అధికారులను అడిగితే 9-12-2023 నాటికి బ్యాంక్‌లో బకాయి ఉన్న రుణం సున్నా ఉన్నట్టు చెప్పారు. ఇదేమిటని అడిగితే సరైన సమాధానం లేదు. పెద్దసార్లు స్పందించి నాకు రుణమాఫీ వర్తింపజేయాలి. – ఎస్.వెంకట్రావు, టేకులపల్లి
రాయపర్తి, ఆగస్టు 30: యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద 40 గ్రామపంచాయతీల పరిధిలోని రైతన్నలు శుక్రవారం యూరియా బస్తాల కోసం బారులు తీరారు. పీఏసీఎస్‌లో యూరియా బస్తా రూ.275కే ఇస్తుండగా, ప్రైవేట్ దుకాణాల వద్ద రూ.350 వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రోజంతా క్యూలో నిలబడితే ఆధార్ కార్డుకు 5 యూరియా బస్తాలే ఇస్తున్నారని పెదవి విరుస్తున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభద్రంను వివరణ కోరగా రోజుకు రెండు లారీల్లో80 టన్నుల యూరియా బస్తాలను తెప్పించి పంపిణీ చేయిస్తున్నామని, రైతులంతా ఒక్కసారిగా ఎగబడుతుండడంతో లైన్లు కన్పిస్తున్నాయని చెప్పారు.