హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కూటమి ఇచ్చే పదవుల కోసమో, కేసుల మాఫీ కోసమో రాజీనామా చేయలేదని, ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేక, పదవికి న్యాయం చేయలేకే వైదొగులుతున్నానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో అన్ని విషయాలు మాట్లాడిన తరువాతనే రాజీనామా చేసినట్టు తెలిపారు. త్వరలోనే పార్టీ నుంచి కూడా వైదొలగనున్నట్టు వెల్లడించారు. రాజ్యసభ చైర్మన్కు రాజీనామా లేఖ అందజేసిన అనంతరం శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఏనాడూ పార్టీతో విబేధించలేదన్నారు. తానేదో అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డానని ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేశాయని వ్యాఖ్యానించారు. తన రాజీనామాతో కూటమికి లబ్ధి చేకూరుతుందనే విషయం తెలిసే వైదొలిగానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆయన కూడా రిజైన్ చేస్తే రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య ఆరుకు తగ్గనున్నది.