వరంగల్, డిసెంబర్ 1: కేంద్ర హోం మంత్రి అమితాషా కనుసన్నల్లోనే వైఎస్ షర్మిల పాదయాత్ర సాగుతున్నదని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలోని దీక్షా దివస్ స్మృతి చిహ్నం వద్ద నివాళి అర్పించి, మోటర్ సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అమిత్‌షాను కలిసిన తర్వాతే తెలంగాణలో షర్మిల పాదయాత్ర మొదలు పెట్టారని వినోద్ అన్నారు.
రాష్ట్ర ఏర్పాటును అడుకున్న వైఎస్సార్ బిడ్డగా షర్మిల తెలంగాణలో తిరగడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. పాదయాత్రలు ఏపీ లో చేస్తే ఫలితం ఉంటుందని సలహా ఇచ్చారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రధాని మోదీ తెలంగాణ వ్యతిరేకి అని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ర్టానికి నవోదయ పాఠశాలలు, మెడికల్ కళాశాలలు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించట్లేదని బండి సంజయ్‌ను నిలదీశారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ లో అల్లర్లు సృష్టిచేందుకు బండి యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చు డో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని బీజేపీ నేతలు ఇప్పుడు యాత్రల పేరిట ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.