హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బెయిల్ పిటిషన్లను రెండు వారాల్లో పరిషరించాలని సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ పిటిషన్లను విచారించి బెయిల్ మంజూరు చేయాలని వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు.
సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేయడాన్ని వారిద్దరూ సవాల్ చేసిన పిటిషన్లను జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని, సీబీఐ చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని వారి తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. భాస్కర్‌రెడ్డికి 72 ఏండ్లని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. 5 నెలలకుపైగా జైల్లోనే ఉన్న వాళ్లకు బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు ఈ నెల 24కు వాయిదా పడ్డాయి.