హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): వైఆర్ టీవీ జర్నలిస్ట్ రంజిత్‌రెడ్డిని సైబర్‌క్రైం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. శనివారం ఉదయం ఆయన తార్నాకలోని తన కార్యాలయంలో లిఫ్ట్ ఎక్కుతుండగా.. అప్పటికే అక్కడ మఫ్టీలో కాపుకాసిన పోలీసులు కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా వైఆర్ టీవీలో రంజిత్‌రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ షేక్ షరీఫ్ శుక్రవారం చేసిన ఫిర్యాదు చేశారని, దీంతో ఐటీ చట్టంలోని 67, 351(2), 352, 353(2) సెక్షన్ల కిం ద రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని పోలీసులు తెలిపా రు. అనంతరం న్యాయమూర్తి నివాసంలో రంజిత్‌రెడ్డి లీగల్ టీమ్ వాదనలు వినిపించడంతో బె యిల్ మంజూరు చేశారు. రెండ్రోజుల్లోగా ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. దీం తో రాత్రి రంజిత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. ఆయన తరఫు న్యా యవాది లక్ష్మణ్ మాట్లాడుతూ.. న మోదు చేసిన సెక్షన్లు 7 ఏండ్లలోపు శి క్షపడే అవకాశమున్నవేనని తెలిపారు.
రేవంత్‌కు వణుకెందుకు: కేటీఆర్
రంజిత్‌రెడ్డి అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘ప్రశ్నించే వారంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకంత వణుకు?’ అంటూ ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులపై దాడులు, అకృత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్కారు నిర్బంధ విధానాలను జర్నలిస్టులంతా ఖండించాలని పేర్కొన్నారు.
అరెస్టు అప్రజాస్వామికం: హరీశ్
జర్నలిస్ట్ రంజిత్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రజల తరుఫున నిలదీస్తే సంకెళ్లు వేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడతారా?’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు.