ఖైరతాబాద్, అక్టోబర్ 19: కొంతమంది యూట్యూబర్లు తనను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని కాప్రాలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన నగల వ్యాపారి గుడివాడ రమణ్‌లాల్ ఆరోపించారు. వారి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణ్‌లాల్ వివరాలు వెల్లడించారు.
30ఏండ్లుగా బంగారం, రత్నాల వ్యాపారంతోపాటు ఏఎస్రావు నగర్లో అదృష్ణ జువెల్లర్స్ పేరిట షాపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 3న హిందూ చానల్స్ ప్రతినిధులమంటూ యూట్యూబర్లు డీ శివప్రసాద్(భారత్ వర్ష), లలిత కుమార్(హిందూ జనశక్తి), హరికృష్ణ(ఏది నిజం) తనను కలిసి, రత్నాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నావంటూ ఆరోపణలు చేస్తూ తనపై వీడియోలు రూపొందిస్తామని బెదిరించినట్లు వెల్లడించారు.
డబ్బులు డిమాండ్ చేయగా రూ.1.50లక్షల వరకు ఇచ్చానని, మళ్లీ గత నెల 23న రూ.60లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని వివరించారు. దీంతో కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తన నుంచి వసూలు చేసిన రూ.1.50లక్షలు తిరిగి ఇప్పించాలని, వాటిని నిస్వార్థంగా పనిచేస్తున్న హిందుత్వ సంస్థలకు అప్పగిస్తానని రమణ్‌లాల్ స్పష్టం చేశారు.